అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Pavan Kalyan | వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అటవీ భూముల ఆక్రమణకు సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) వీడియో విడుదల చేశారు. పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఫారెస్ట్ భూములను ఆక్రమించారని ఆయన బుధవారం ఆరోపించిన విషయం తెలిసిందే. గురువారం ఇందుకు సంబంధించిన వీడియోను పవన్ విడుదల చేశారు.
అటవీ భూముల ఆక్రమణలపై బుధవారం పవన్ అధికారులతో సమీక్షించారు. అడవి మధ్యలో ఉన్న భూమి మాజీ మంత్రి పెద్దిరెడ్డి (Former Minister Peddi Reddy) కుటుంబానికి వారసత్వంగా ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. భూమి ఎప్పుడు చేతులు మారిందో తెలుసుకోవాలని ఆదేశించారు. అటవీ భూముల్లో ఆస్తులు కబ్జా చేసి ఎస్టేట్‌లు నిర్మించిన వాళ్లు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా చట్ట ప్రకారం ముందుకెళ్లాలని సూచించారు. మంగళంపేట పరిధిలో అటవీ భూముల ఆక్రమణపై విజిలెన్స్ నివేదిక కీలకం అని పవన్ పేర్కొన్నారు. పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిన భూముల వివరాలు ఆ నివేదికలో ఉన్నాయని తెలిపారు. ఈస్ట్ ఘాట్‌లోని రక్షిత అటవీ ప్రాంతంలో 76.74 ఎకరాల భూకబ్జా బయటపడిందంటూ పవన్ ట్వీట్ చేశారు.
Pavan Kalyan | సమగ్ర దర్యాప్తునకు ఆదేశం
రాష్ట్రంలో అటవీ భూముల కబ్జాపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. అటవీ భూముల కబ్జాల వివరాలను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ (Forest Department) వెబ్సైట్లో పెట్టాలన్నారు. ప్రతి ఒక్క కబ్జా వివరాలు పూర్తిస్థాయిలో సేకరించాలని సూచించారు. భూములు ఆక్రమించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దీనికోసం విజిలెన్స్ రిపోర్ట్ (Vigilance Report), న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచించారు. ఎవరి ఆక్రమణలో ఎంత ఉంది? వారిపై నమోదైన కేసుల వివరాలు ప్రజలకి తెలియాలన్నారు. రాజకీయాలకు అతీతంగా భావి తరాలకు ప్రకృతి సంపద అందించాలని ఆయన పేర్కొన్నారు. అటవీ భూములను రక్షించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు.
