అక్షరటుడే, వెబ్డెస్క్ : YS Jagan | ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విచారణ నాంపల్లి కోర్టులో ముగిసింది. గురువారం విచారణ ఉండటంతో ఆయన హైదరాబాద్ (Hyderabad)కు చేరుకున్న విషయం తెలిసిందే. బేగంపేట ఎయిర్పోర్టులో వైసీపీ నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జగన్ నాంపల్లి కోర్టు (Nampally Court)లో హాజరయ్యారు.
అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్పై ఉన్న విషయం తెలిసిందే. ఆయన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావడం లేదు. ఈ క్రమంలో ప్రత్యక్షంగా హాజరు కావాలని సీబీఐ (CBI) గతంలో వాదించింది. దీంతో ఈ నెల 21లోపు స్వయంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. దీంతో గురువారం ఆయన కోర్టుకు వచ్చారు. అయితే 5 నిమిషాలు మాత్రమే కోర్టులో ఉన్నారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరగా.. సీబీఐ వ్యతిరేకించింది. కాగా ఆయన హాజరైనట్లు రికార్డులో నమోదు చేశారు. అనంతరం విచారణ ముగిసింది.
YS Jagan | లోటస్ పాండ్లో ఉద్రిక్తత
విచారణ అనంతరం జగన్ బంజారాహిల్స్ (Banjara Hills)లోని లోటస్ పాండ్ వద్ద తన నివాసానికి చేరుకున్నారు. జగన్ వస్తున్నారని తెలుసుకొని ఆయన ఇంటి వద్ద భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. ఒక్కసారిగా జగన్ (YS Jagan) ఇంటి వద్దకు అభిమానులు చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగన్ వాహనాన్ని అభిమానులు చుట్టుముట్టడంతో పోలీసులు చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలీసులకి అభిమానులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం అభిమానులకు అభివాదం చేస్తూ జగన్ లోపలికి వెళ్లిపోయారు.
