అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. ఈసారి పల్లె రాజకీయ ముఖచిత్రం బాగా మారిపోయింది. ఎన్నికల్లో పోటీకి యువతరం తహాతహాలాడుతోంది.
సర్పంచ్ పదవిపై పెద్ద సంఖ్యలో యువ నేతలు కన్నేశారు. రాజకీయ భవిష్యత్తుకు తొలి అడుగుగా భావించే సర్పంచ్ కుర్చీని స్వాధీనం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. రిజర్వేషన్లు కూడా కలిసి రావడంతో చాలా మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని యత్నిస్తున్నారు. సర్పంచ్‌గా గెలవాలంటే గ్రామంలో పట్టు పెంచుకోవాలన్న భావనతో ఇప్పటికే చాలా మంది సేవా కార్యక్రమాలు ప్రారంభించారు.
Local Body Elections | విడుదలైన షెడ్యూల్
స్థానిక సంస్థల సమరానికి షెడ్యూల్ వెలువడించింది. గ్రామపంచాయతీలతోపాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం(Election Commission) ఇటీవలే విడుదల చేసింది. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు తొలి రెండు దశల్లో, ఆ తర్వాత సర్పంచ్(Sarpanch), వార్డు మెంబర్లకు మూడు విడుతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అక్టోబర్ 9న నోటిఫికేషన్ జారీ కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 5,749 ఎంపీటీసీలు, 565 జెడ్పీటీసీలకు సంబంధించి అక్టోబర్ 23, 27న రెండు విడుతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే, మొత్తం గ్రామ పంచాయితీలు 12,733లకు గానూ 1,12, 288 వార్డులకు సంబంధించి అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో మూడు విడతలుగా గ్రామపంచాయతీ ఎన్నికలు ఎన్నికలు జరుగనున్నాయి.
Local Body Elections | సర్పంచ్ గిరిపైనే అందరి కన్ను..
ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో ఆశావాహులు రంగంలోకి దిగారు. సమరానికి సన్నాహాలు ప్రారంభించారు. ప్రధానంగా గ్రామాల్లోని యువత ఎన్నికల బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందులోనూ విద్యావంతులే ఎన్నికలపై ఆసక్తి చూపుతుండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్‌కు గడువు సమీపిస్తుండడంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ఆశావాహులు ఇప్పటికే తమ సన్నిహితులు, స్నేహితులతో మంథనాల్లో మునిగిపోయారు. ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మరోవైపు, ఎంపీటీసీ, జడ్పీటీసీ కంటే సర్పంచ్‌గా పోటీ చేయడానికే అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. గ్రామంలో ఏ పని జరగాలన్నా సర్పంచే కీలకం కావడంతో ఆ పదవిపైనే అందరూ కన్నేశారు. పార్టీ రహిత ఎన్నికలు కావడంతో పోటీ చేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.
Local Body Elections | మొదలైన ప్రచారం..
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు(Local Body Elections) జరుగనున్న నేపథ్యంలో ఆశావహులు అప్పుడే ప్రచారం ప్రారంభించారు. తమ సన్నిహితులు, నమ్మకస్తులను కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆకాంక్షను వెలిబుచ్చుతున్నారు. తనకే మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. మరోవైపు, గ్రామంలో సేవా కార్యక్రమాలు సైతం ప్రారంభించారు. ఎవరైనా చనిపోతే లేకపోతే అనారోగ్యంతో బాధ పడుతుంతే వాళ్ల ఇళ్లకు వెళ్లి పరామర్శించడం, ఆర్థికంగా ఎంతో కొంత సహాయం చేయడం చేస్తున్నారు. ఏ సమస్య వచ్చినా అక్కడ వాలిపోయి హడావుడి చేస్తున్నారు. ఇక, ఎన్నికల షెడ్యూల్ రావడంతో పల్లెల్లో ఫ్లెక్సీల కోలాహాలం కూడా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా ఆశావాహుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు వెలిశాయి. దసరా, బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ వాడవాడలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మొత్తంగా ఏదో విధంగా జనంలో ఉంటూ, వారి దృష్టిని ఆకర్షించే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.