అక్షరటుడే, వెబ్డెస్క్ : Delhi Floods | ఢిల్లీని వరదలు వీడటం లేదు. యమున నది (Yamuna River) ఉగ్రరూపం దాల్చడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో భారీ వరదలు ముంచెత్తాయి. తొమ్మిది రోజులుగా యుమన నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. అయితే నిన్న మొన్నటితో పోలీస్తే యమున నది కాస్త శాంతించింది. పాత రైల్వేబ్రిడ్జి దగ్గర 205.5 మీటర్ల నీటిమట్టంతో నది పారుతోంది. వరదల ధాటికి సుమారు 12 వేల మంది పునరావాస శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఐదు జిల్లాలపై వరదల ప్రభావం పడింది.
Delhi Floods | మూడో సారి
యమున నది ఇంత భారీ స్థాయిలో ఉప్పొంగి ప్రవహించడం చరిత్రలో ఇది మూడోసారి. మూడు రోజుల క్రితం 207.41 మీటర్ల ఎత్తులో నది ప్రవహించింది. 1978, 2023లో మాత్రమే నదికి ఇంత భారీ స్థాయిలో వరద వచ్చింది. దీంతో 38 ప్రాంతాల్లో పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వరదల ధాటికి నగరంలో భారీ స్థాయిలో నష్టం జరిగింది. వేలాది ఇళ్లు నీట మునిగాయి.
Delhi Floods | కొనసాగుతున్న వరద
ఎగువన ఉన్న వజీరాబాద్ (Wazirabad), హథినీకుండ్ (Hathinikund) బ్యారేజీల నుంచి యమున నదికి నీటి విడుదల కొనసాగుతోంది. దీంతో వరద ముంపు ఇంకా తప్పలేదని అధికారులు అంటున్నారు. అక్షరధామ్ సమీపంలోని ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే వెంబడి 70కి పైగా కుటుంబాలు తాత్కాలిక గుడారాలలో నివసిస్తున్నాయి. అధికారులు అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలు చేపడుతున్నారు.
నదికి సమీపంలోని లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలకు తాత్కాలికంగా వసతి కల్పించడానికి ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే, మయూర్ విహార్, కాశ్మీర్ గేట్ మరియు సమీప ప్రాంతాలలో టెంట్లు ఏర్పాటు చేశారు. శనివారం హత్నికుండ్ బ్యారేజీ నుంచి 50,629 క్యూసెక్కులు, వజీరాబాద్ బ్యారేజీ నుంచి 1,17,260 క్యూసెక్కులు విడదలు చేశారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.