అక్షరటుడే, వెబ్‌డెస్క్: Women’s Premier League 2026 | మహిళా ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ తిరిగి పాత ఫామ్ అందిపుచ్చుకుంది. శనివారం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబయి ఇండియన్స్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. బ్యాటింగ్‌లో పరుగుల వర్షం కురిపించిన ముంబయి, అనంతరం బౌలింగ్‌లోనూ అదే ప్రదర్శనతో ఢిల్లీని కట్టడి చేసి సీజన్‌లో తొలి విజయాన్ని ఘనంగా అందుకుంది.టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. అమెలియా కెర్ డకౌట్ కావడం, కమలిని (16) త్వరగా పెవిలియన్ చేరడంతో స్కోరు నెమ్మదించింది. అయితే ఈ దశలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, నేట్ సీవర్ బ్రంట్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. సీవర్ బ్రంట్ 46 బంతుల్లో 70 పరుగులతో ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దగా, మరోవైపు హర్మన్‌ప్రీత్ కౌర్ 34 బంతుల్లోనే 74 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.
Women’s Premier League 2026 | విధ్వంసకర బ్యాటింగ్..
వీరిద్దరి విధ్వంసకర బ్యాటింగ్‌తో ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఢిల్లీ బౌలర్లలో నందిని శర్మ రెండు వికెట్లు తీసి కొంతమేర ప్రతిఘటన చూపించింది. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆరంభం నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు షెఫాలీ వర్మ (8), లిజెల్ లీ (10) త్వరగా అవుట్ అయ్యారు. కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ (1) కూడా విఫలమవ్వడంతో ఢిల్లీ ఒత్తిడిలో పడింది. స్టార్ ప్లేయర్లు లారా వోల్వార్డ్ (9), మారిజన్ కాప్ (10) కూడా తక్కువ స్కోర్లకే వెనుదిరగడంతో స్కోర్ బోర్డు ముందుకు కదలలేదు. ఒక దశలో ఢిల్లీ 74 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పూర్తిగా కష్టాల్లో చిక్కుకుంది.
ఈ పరిస్థితుల్లో చినెలే హెన్రీ ఒంటరి పోరాటం చేసింది. ఆమె కేవలం 33 బంతుల్లో 56 పరుగులు చేసి ఢిల్లీ ఆశలను కొంతవరకు నిలిపింది. ఆమె ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అయితే మిగతా బ్యాటర్లు సహకరించకపోవడంతో ఆమె పోరాటం ఫలించలేదు. చివర్లో మిన్నూ మణి (7) కూడా అవుట్ కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 145 పరుగులకే ఆలౌట్ అయింది. ముంబయి ఇండియన్స్ బౌలింగ్ విభాగంలో షబ్నిమ్ ఇస్మాయిల్, అమెలియా కెర్, నేట్ సీవర్ బ్రంట్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఢిల్లీ బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు. ఈ విజయం ద్వారా ముంబయి ఇండియన్స్ ఈ సీజన్‌లో తమ ఖాతాను తెరిచింది, ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది నిరాశాజనక ఓటమిగా మిగిలింది.