అక్షరటుడే, వెబ్డెస్క్: District Reorganization | రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న జిల్లాల హద్దుల మార్పు, పలు జిల్లాలను కుదిస్తారని సమాచారం.
బీఆర్ఎస్ హయాంలో 2016లో రాష్ట్రంలో జిల్లాలను పునర్ విభజించారు. 31 జిల్లాలను ఏర్పాటు చేశారు. అనంతరం 2020లో నారాయణపేట, 2021లో ములుగును జిల్లా (Mulugu District)గా మార్చారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 33కు చేరింది. 74 రెవెన్యూ డివిజన్లు, 612 మండలాలు ఉన్నాయి. అయితే పలు జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదనే వాదన ఉంది. ఈ మేరకు ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) జిల్లాలను పునర్ వ్యవస్థీకరించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
District Reorganization | గతంలోనే ప్రకటన
కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. తాము అధికారంలోకి వస్తే జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై సమీక్ష చేస్తామని గతంలోనే కాంగ్రెస్ ప్రకటించింది. జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదని గతంలో సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) సైతం పేర్కొన్నారు. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల తర్వాత జిల్లాల విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మార్పులు చేర్పులపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
District Reorganization | నేతల వ్యాఖ్యలతో..
హుస్నాబాద్ గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉండేది. అయితే పునర్విభజన సమయంలో సిద్దిపేటలో కలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ఇటీవల హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా సిద్దిపేటలో కలిపారన్నారు. భవిష్యత్లో మళ్లీ కరీంనగర్ జిల్లాలో కలుపుతామన్నారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సైతం ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను ఆరు ముక్కలు చేసి అన్యాయం చేశారన్నారు. ఈ విషయాన్ని తాను ప్రతి ప్రెస్ మీట్లో చెప్తూ వస్తున్నట్లు తెలిపారు. సీఎం దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లానని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్లీ ఈ ఆరు జిల్లాలను వరంగల్లో కలిపే ఆలోచనలోనే ఉన్నారని ఆయన అన్నారు. కాగా ప్రభుత్వం జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై ఆలోచిస్తుండటంతోనే నేతలు వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలిసింది.