అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rahul Gandhi | కేంద్ర ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగబద్ద సంస్థలపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేస్తున్న ఆరోపణలపై మేధావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 300 మంది రిటైర్డ్ జడ్జీలు, అధికారులు, మాజీ సైనిక అధికారులతో కూడిన బృందం కాంగ్రెస్ పార్టీ (Congress Party)పై తీవ్ర విమర్శలు చేసింది.
‘ఓటు చోరీ’ ప్రచారం కింద ఎన్నికల కమిషన్ (Election Commission) వంటి రాజ్యాంగ సంస్థలను కళంకం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించింది. ఈ ఆరోపణలు “సంస్థాగత సంక్షోభం ముసుగులో రాజకీయ నిరాశను కప్పిపుచ్చే ప్రయత్నం” అని ఆ బృందం బహిరంగ లేఖను విడుదల చేసింది. ఈ లేఖపై సంతకం చేసిన 272 మందిలో 16 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు (Retired Judges), 14 మంది రాయబారులు సహా 123 మంది మాజీ అధికారులు, 133 మంది రిటైర్డ్ సాయుధ దళాల అధికారులు ఉన్నారు. 272 మంది సంతకం చేసిన వారిలో ప్రముఖులు జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ ఎస్పీ వైద్, రా మాజీ చీఫ్ సంజీవ్ త్రిపాఠి, మాజీ ఐఎఫ్ఎస్ లక్ష్మీ పూరి ఇతరులు ఉన్నారు.
Rahul Gandhi | ఇదేం దాడి..?
“జాతీయ రాజ్యాంగ అధికారులపై దాడి” అనే శీర్షికతో మాజీ న్యాయమూర్తులు, అధికారులు రాసిన లేఖలో కీలకాంశాలు ప్రస్తావించారు. “భారత ప్రజాస్వామ్యం బలవంతంగా కాకుండా, దాని పునాదిగా భావించే సంస్థలపై పెరుగుతున్న విషపూరిత వాక్చాతుర్యంతో దాడి చేయడంపై పౌర సమాజంలోని సీనియర్ పౌరులమైన మేము తీవ్ర ఆందోళనకు గురవుతున్నామని” పేర్కొన్నారు. నిజమైన విధాన ప్రత్యామ్నాయాన్ని అందించడానికి బదులుగా కొంతమంది రాజకీయ నాయకులు వారి నాటకీయ రాజకీయ వ్యూహంలో రెచ్చగొట్టే కానీ ఆధారాలు లేని ఆరోపణలను ఆశ్రయిస్తున్నారని మండిపడ్డారు. భారత సాయుధ దళాల శౌర్యం. విజయాలను ప్రశ్నించడం ద్వారా, న్యాయవ్యవస్థను, పార్లమెంటును ప్రశ్నించడం ద్వారా కళంకం కలిగించడానికి ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎన్నికల సంఘం సమగ్రత, ప్రతిష్టపై క్రమబద్ధమైన, కుట్రపూరిత దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
Rahul Gandhi | అభ్యంతరకర వ్యాఖ్యలు..
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ఎన్నికల కమిషన్‌పై పదేపదే దాడి చేశారని మాజీ న్యాయమూర్తులు, సైనికాధాకరులు విమర్శించారు. ఎన్నికల కమిషన్ ఓటు దొంగతనానికి పాల్పడిందని చెబుతున్న ఆయన.. రుజువులు చూపడంలో, డిక్లరేషన్ ఇవ్వడంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుడి “అణు బాంబు” వ్యాఖ్యలను నమ్మశక్యం కాని అసభ్యకరమైన వాక్చాతుర్యంగా అభివర్ణించారు. ఇంత తీవ్రమైన, నిరాధార ఆరోపణలు చేసిన రాహుల్‌గాంధీ అఫిడవిట్‌తో పాటు ఆయన ద్వారా ఎటువంటి అధికారిక ఫిర్యాదు దాఖలు చేయబడలేదని గుర్తు చేశారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Special Intensive Revision) కార్యక్రమాన్ని సైతం తప్పుబట్టడాన్ని ఖండించారు. ఇటువంటి ఆవేశపూరిత వాక్చాతుర్యం భావోద్వేగపరంగా శక్తివంతమైనది కావచ్చు – కానీ అది వాస్తవ పరిశీలనలో అవాస్తవమని తేలుతుందని పేర్కొన్నారు.
రాజకీయ నాయకులు సాధారణ పౌరుల ఆకాంక్షలతో సంబంధం కోల్పోయినప్పుడు, వారు తమ విశ్వసనీయతను పునర్నిర్మించడానికి బదులుగా రాజ్యాంగబద్ధ సంస్థలపై ఇలా విరుచుకుపడతారని మండిపడ్డారు. గెలిచినప్పుడు ఎన్నికల సంఘంపై ఎలాంటి ఆరోపణలు చేయని రాజకీయ పార్టీలు.. ఓడిపోతే మాత్రం తప్పుడు ఆరోపణలు చేస్తాయని ఎత్తిచూపారు. ఇది ప్రతిపక్ష పార్టీ అవకాశవాదానికి నిదర్శనమని మండిపడ్డారు.
