అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: CP Sai Chaitanya | సంక్రాంతి పండుగ (Sankranti festival) సందర్భంగా జిల్లాలో కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సాయి చైతన్య హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్(Nizamabad Police Commissionerate) పరిధిలో కోడిపందాలు, జూదం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం ఉండడంతో నిఘా పెట్టామన్నారు. పండుగ సందర్భంగా నిరంతర వాహన తనిఖీలు, సరిహద్దు ప్రాంతాల్లో పికెట్ ఏర్పాటు చేయడం జరిగిందని సీపీ తెలిపారు. మహారాష్ట్ర(Maharashtra), నిజామాబాద్ సరిహద్దు పోలీస్ స్టేషన్లలో సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని తెలియజేశారు. కోడిపందాలు, జూదం ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పట్టుబడిన వ్యక్తులపై కఠినచర్యలు తీసుకునేందుకు ఇప్పటికే పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఎక్కడైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్టు తెలిస్తే డయల్ 100కు సమాచారం అందించాలని ప్రజలను సీపీ కోరారు.
