అక్షరటుడే, వెబ్‌డెస్క్: CM Revanth Reddy | జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో కమిటీ వేస్తామని ప్రకటించారు.
రాష్ట్రంలో జిల్లాల మార్పుపై కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. ప్రభుత్వం జిల్లాల సంఖ్య తగ్గిస్తోందని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో సోమవారం సీఎం దానిపై స్పష్టత ఇచ్చారు. జిల్లాల సంఖ్య తగ్గింపుపై ఎలాంటి పుకార్లు నమ్మవద్దన్నారు. గతంలో జిల్లాల ఏర్పాటు ఇష్టారాజ్యంగా చేశారని ఆయన విమర్శించారు. ఆశాస్త్రీయంగా విభజన జరిగిందన్నారు. దీనిని తమ ప్రభుత్వం సరి చేస్తుందన్నారు.
CM Revanth Reddy | అన్ని పార్టీలతో చర్చించి..
ప్రస్తుతం జిల్లాలు, మండలాల (districts and mandals) విభజన సరైన రీతిలో జరగలేదని సీఎం అన్నారు. కొన్ని జిల్లాల్లో నాలుగైదు నియోజకవర్గాలు ఉంటే.. కొన్నింట్లో ఒకటి, రెండు నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయన్నారు. కొన్ని మండలాల్లో జనాభా ఎక్కువగా ఉంటే, మరికొన్నింటిలో తక్కువగా ఉందన్నారు. ఇలా కాకుండా జనాభా దాదాపు సమానంగా ఉండేలా మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను పునర్ వ్యవస్థీకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. దీనికోసం త్వరలో రిటైర్డ్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి (Supreme Court judge) నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కమిషన్ రాష్ట్రమంతటా పర్యటించి, జిల్లాలు మరియు మండలాల హేతుబద్ధీకరణపై ప్రజల నుంచి సూచనలు మరియు అభిప్రాయాలను సేకరిస్తుందని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి జిల్లాలు, మండలాలను ఖరారు చేస్తామన్నారు.
CM Revanth Reddy | ఏం మార్చలేదు..
కొందరు కావాలనే ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం అన్నారు. సికింద్రాబాద్ విషయంలో తాను ఏం మార్చలేదని పేర్కొన్నారు. ఇటీవల మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. సికింద్రాబాద్‌ను ప్రభుత్వం విభజించాలని చూస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో సీఎం స్పందించారు. తాను రాచకొండ కమిషనరేట్ పేరు తప్ప జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లాల పేర్లు మార్చలేదన్నారు. కాగా రాచకొండ కమిషనరేట్ పేరును ప్రభుత్వం మల్కాజ్గిరి కమిషనరేట్‌గా మార్చిన విషయం తెలిసిందే.