అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | నదీ జలాల విషయంలో పక్క రాష్ట్రాలతో వివాదాలు కోరుకోవడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి (Chief Minister Revanth Reddy) అన్నారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం (Telangana government) భావిస్తోందన్నారు.
నదీ జలాలపై రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రభుత్వం భావించడం లేదని సీఎం అన్నారు. రాజకీయాలకు అతీతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా (Ranga Reddy district) మహేశ్వరం మండలం రావిర్యాలలోని ఈ-సిటీలో నెలకొల్పిన సుజెన్ మెడికేర్ (Suzen Medicare) ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు.
CM Revanth Reddy | చర్చల ద్వారా..
పక్క రాష్ట్రాలతో తెలంగాణ వివాదాలను కోరుకోవడం లేదని రేవంత్‌రెడ్డి అన్నారు. న్యాయస్థానాల ముందుకు, మరెవరి వద్దనో పంచాయితీ పెట్టుకునే కన్నా సమస్యపై కూర్చొని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. నీటి వివాదాల విషయంలో తెలంగాణ శాశ్వత పరిష్కారం కోరుకుంటోందని తెలిపారు. కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టించొద్దని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ఆయన కోరారు. పాలమూరు – రంగారెడ్డి, కల్వకుర్తి, డిండి, ఎస్ఎల్బీసీ, బీమా, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలతో పర్యావరణం, సీడబ్ల్యూసీ నుంచి సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
CM Revanth Reddy | రైతుల ప్రయోజనాలే ముఖ్యం
రాజకీయ ప్రయోజనాలకన్నా ప్రజలు, రైతుల ప్రయోజనాల కోసం ఆలోచన చేస్తున్నామని సీఎం తెలిపారు. పోర్టు కనెక్టివిటీ లేని తెలంగాణకు మచిలీపట్నం పోర్టుతో కనెక్టివిటీ కోసం 12 లేన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే, రైల్వే కనెక్టివిటీతో సహా అనుమతి అడిగామని, ఆ కనెక్టివిటీని అభివృద్ధి చేయాలంటే పక్క రాష్ట్రం సహకారం అవసరమని చెప్పారు. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి చెందాలంటే తెలంగాణ సహకారం అవసరం ఉంటుందన్నారు. పరస్పరం సహకరించుకుంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు.