అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలో తాగునీటి కష్టాల గురించి చెప్పనక్కర్లేదు. సరిపడ నీళ్లు రాక చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా బస్తీల్లో ఉండేవారు ఎక్కువగా నీటి కోసం తిప్పలు పడుతుంటారు.
నగరంలో జల మండలి (Jala Mandali) ఆధ్వర్యంలో నిత్యం తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఉచితంగా సరఫరా చేసే ఈ నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తారు. ఎంతో మంది నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని, దుర్వినియోగం చేయొద్దని అవగాహన కల్పిస్తుంటారు. అయినా కూడా కొందరు జల మండలి(HMWS SB) సరఫరా చేసే నీటిని వృథా చేస్తున్నారు. అలాంటి వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తికి రూ.పది వేల జరిమానా వేశారు.
Hyderabad | కారు కడగడంతో..
బంజారాహిల్స్ (Banjara Hills) రోడ్ నంబర్ 12లో ఓ వ్యక్తి తన మెర్సిడెస్ జీ వాగన్ కారును జలమండలి సరఫరా చేసే తాగునీటితో కడుగుతున్నాడు. అటుగా వెళ్తున్న వాటర్ బోర్డు ఎండీ అశోక్ దీనిని గమనించాడు. వెంటనే అతడిని ఆపారు. అంతేగాకుండా రూ.పది వేల ఫైన్ వేశారు. తాగునీటిని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Hyderabad | నీటి సరఫరాకు అంతరాయం
నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. కృష్ణా ఫేజ్-1,2, 3 పంపింగ్ స్టేషన్లకు విద్యుత్ సరఫరా చేసే బల్క్ ఫీడర్ల నిర్వహణ, దెబ్బతిన్న కరెంట్ ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో కొత్తవి అమర్చడానికి చర్యలు చేపట్టారు. దీంతో నగరంలోని చార్మినార్, వినయ్ నగర్, బొజగుట్ట, రెడ్ హిల్స్, నారాయణ గూడ, మారేడ్పల్లి, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, రియాసత్ నగర్, సాహెబ్ నగర్, హయత్ నగర్, సైనిక్ పురి, ఉప్పల్, హఫీజ్పేట్, రాజేంద్ర నగర్, మణికొండ, బోడుప్పల్, మీర్ పేట్ డివిజన్ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు.
