అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | అభివృద్ధి ఎవరు చేస్తున్నారో చూసి ఓటు వేయాలని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ (Government advisor Shabbir Ali) ప్రజలను కోరారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని (Kamareddy municipality) సరంపల్లి, పాత రాజంపేటలో అంతర్గత రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థ పనులను సోమవారం ప్రారంభించారు. అలాగే టేక్రియాల్ గ్రామంలో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు.
Shabbir Ali | మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..
అనంతరం అడ్లూరు గ్రామంలో (Adloor village) సీసీ రోడ్లు, డ్రెయినేజీల పనులకు షబ్బీర్అలీ శంకుస్థాపన చేశారు. పెండింగ్‌లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పట్టణంలో తాము చేసిన అభివృద్ధిని చూపిస్తూనే ప్రజల ముందుకు వస్తున్నామన్నారు.
Shabbir Ali | విద్వేష ప్రసంగాలు కడుపు నింపవు..
విద్వేష ప్రసంగాలు ఎవరి కడుపు నింపవని, ఆ మాటలు మనుషుల మధ్య దూరాన్ని మాత్రమే పెంచుతాయని షబ్బీర్ అలీ అన్నారు. రెచ్చగొట్టే మాటలకు మోసపోకుండా అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీని (Congress party) ఆశీర్వదించాలని కోరారు. అభివృద్దే తమ అజెండా అని, మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. తాము చేసిన పనులను చూసి ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నామన్నారు. మతాల మధ్య విద్వేషాలు సృష్టించే వారికి ఓటుతో బుద్ధి చెప్పి వారిని ఇంటి వద్దే కూర్చోబెట్టాలని సూచించారు. సమస్యలను పరిష్కరించే వారికే అండగా ఉండాలని, ప్రజల కష్టసుఖాల్లో తోడుంటూ, నిత్యం అందుబాటులో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలపాలన్నారు. కామారెడ్డి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను వేగవంతం చేస్తోందన్నారు.
Shabbir Ali | కాంగ్రెస్ లో పలువురి చేరిక
పట్టణంలోని పలు వార్డులకు చెందిన కార్యకర్తలు షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధిని చూసి ఇతర పార్టీల నుంచి నేతలు స్వచ్ఛందంగా తమ పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు. కామారెడ్డి పట్టణ అభివృద్ధి కేవలం కాంగ్రెస్‌తోనే సాధ్యమని, కొత్తగా చేరిన వారందరికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ చేరికలతో కామారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొందని, రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని పేర్కొన్నారు.