అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Panchayat elections | గతంలో ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయంటే అభ్యర్థులకు మద్దతుగా ఫోన్లు వచ్చేవి. పలానా అభ్యర్థికి ఓటు వేయాలని వాయిస్ ఓవర్ కాల్స్ (Voice-over calls) వచ్చేవి. అయితే ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల (sarpanch elections) నేపథ్యంలో కూడా ఫోన్లు రావడం తీవ్ర చర్చకు దారి తీసింది. అది కూడా ఓ అభ్యర్థికి వ్యతిరేకంగా ఫోన్లు వస్తుండటం గమనార్హం.
కామారెడ్డి జిల్లా గాంధారి మండల (Gandhari mandal) కేంద్రంలో సర్పంచ్ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. ఇక్కడ రెండో దశలో భాగంగా ఈ నెల 14న పోలింగ్ జరగనుంది. శుక్రవారం సాయంత్రంతో ప్రచార పర్వం ముగిసింది. ఇక్కడ గతంలో సర్పంచ్‌గా పనిచేసిన వ్యక్తి తాజాగా తన భార్యను బరిలో దింపారు. ఆయన హయాంలో భారీగా అవినతి జరిగిందని, ఆక్రమణలు చేశాడని ఆరోపణలతో మండల కేంద్రంలోని ప్రజలకు ఫోన్లు వస్తున్నాయి.
Panchayat elections | హాట్ టాపిక్
గాంధారి నుంచి లింగంపేట వెళ్లే దారిలో రూ.కోట్ల విలువైన రెండెకరాల స్థలాన్ని సదరు నేత కబ్జా చేశాడని, అనుమతుల పేరిట రూ.50 లక్షలు తీసుకున్నాడని ఓటర్లకు కాల్స్ వచ్చాయి. గ్రామంలో మిగిలిన కొద్దిపాటి భూములు కూడా ఆయన దోపిడీకి గురి కావొద్దంటే ఓటు వేసేటప్పుడు ఆలోచించాలని ఐవీఆర్ కాల్ వస్తోంది. కొందరికి రెండు మూడు సార్లు ఫోన్లు వచ్చినట్లు తెలుస్తోంది. సదరు అభ్యర్థి ప్రత్యర్థులు వ్యతిరేకత రావాలని ఇదంతా చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గాంధారిలో ఇదే అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశం జరగబోయే ఎన్నికల్లో ఎలాంటి మార్పులు తెస్తుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.