అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Janasena Party | ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా నిలుస్తున్నారు ఇద్దరు జనసేన ఎమ్మెల్యేలు. మొత్తం 21 మంది జనసేన ఎమ్మెల్యేలలో, ఉత్తరాంధ్ర నుంచి గెలిచిన సీనియర్ నేతలు యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్.
వీరిద్దరు కూటమి ప్రభుత్వానికీ, జనసేన పార్టీ (Janasena Party)కీ విపరీతమైన చిక్కులు తెచ్చిపెడుతున్నారన్న టాక్ రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతోంది.ఎన్నికల్లో తొలి విజయాన్ని సాధించిన వీరిద్దరూ ప్రజా వ్యతిరేక కార్యకలాపాల్లో మునిగిపోతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గాల్లో ‘‘తమకే అధికారం’’ అన్నట్టు ప్రవర్తించడం, కావాలనే వివాదాలకు కారణమవుతున్నారా అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
Janasena Party | విజయ్ కుమార్‌పై ఘోర ఆరోపణలు
జనసేన ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న సుందరపు విజయ్ కుమార్ (Vijay Kumar)ను క్యాడర్ ఎంతో నమ్మకంతో ఎమ్మెల్యేగా పంపింది. కానీ ఏడాదిన్నర వ్యవధిలోనే ఆయనపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. రియల్ ఎస్టేట్ సెటిల్‌మెంట్లు, SEZ కంపెనీలతో వివాదాలు, విలువైన భూ వివాదంలో జోక్యం ఆయనకి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి. తాజాగా అచ్యుతాపురం మండలం దుప్పుతూరు గ్రామంలో 33 ఎకరాల భూమిపై జరుగుతున్న వివాదంలో ఆయన నేరుగా తలదూర్చారని బాధితులు ఆరోపిస్తున్నారు. వారు మీడియా ముందుకు వచ్చి ఆధారాలు చూపించడంతో హంగామా పెద్దదైంది. ఇది చాలదన్నట్లుగా, మిత్రపక్షం అయిన టీడీపీ క్యాడర్‌ను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి బలంగా వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారాలన్నీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) వరకు చేరడంతో ఆయన స్వయంగా విజయ్ కుమార్‌ను మందలించినట్లు సమాచారం.
ప్రజారాజ్యం నుంచి వైసీపీ YCP, అక్కడి నుంచి జనసేన వరకు దాదాపు రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న వంశీకృష్ణ (Vamsi Krishna Srinivas), ఎమ్మెల్యే అయిన తర్వాత పూర్తిగా మారిపోయారని పార్టీ వర్గాల్లో చర్చ. హోటల్స్‌లో పేకాట డెన్లకు అండ, ఆన్‌లైన్ బెట్టింగ్ గ్యాంగ్‌లకు సహకారం, నెలవారీ కమిషన్లు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఇటీవలి కాలంలో ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన బెట్టింగ్ రైడ్ (Betting Ride)లో నిందితులను కాపాడారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు, నియోజకవర్గంలో ఏ బిల్డింగ్ నిర్మాణమైనా, అన్ని అనుమతులు ఉన్నా స MLA అనుచరులకు కప్పం కడితేనే పని జరుగుతుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది.తాజాగా విశాఖ జైలు రోడ్డులో ఉన్న ఫుడ్ కోర్ట్ స్టాల్‌లపై ఆయన అనుచరులు లక్షల రూపాయలు వసూలు చేశారన్న ఆరోపణలతో వ్యాపారులు ఆందోళనకు దిగారు. రెండు నియోజకవర్గాల్లోనూ ప్రజల నుంచి, అధికారులు నుంచి, మిత్రపక్షం నుంచి తీవ్రమైన ఫిర్యాదులు రావడంతో వీరి వ్యవహారాలు పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లాయి. పార్టీకి చెడ్డ పేరు తేవొద్దని ఇద్దరికీ క్లియర్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ఈ హెచ్చరికలతో ఈ ఇద్దరు ఎమ్మెల్యేల తీరు మారుతుందా? లేక మున్ముందు మరిన్ని వివాదాలు తెచ్చి పార్టీకీ, ప్రభుత్వానికీ ఇబ్బందులు పెంచుతారా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
