Homeఆంధప్రదేశ్Travel bus accident | మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం.. 15 మందికి...

Travel bus accident | మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం.. 15 మందికి తీవ్ర గాయాలు

గ‌త కొద్ది రోజులుగా ట్రావెల్ బ‌స్సు ప్రమాదాలు ప్రయాణికుల‌ని వ‌ణికిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల‌లోనే ఈ ప్ర‌మాదాలు ఎక్క‌వుగా జ‌రుగుతున్నాయి. తాజాగా జ‌రిగిన ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సు ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతి చెందారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Travel bus accident | ఈ మ‌ధ్య తెలుగు రాష్ట్రాల‌లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు Private travel Bus వరుసగా ప్రమాదాలకు గురవుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా మరో విషాదం చోటుచేసుకుంది.

హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వెళ్తున్న మైత్రి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పేరాయిపల్లి మిట్ట సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది.

అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా, మరో 15 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.

Travel bus accident | ప్రమాదం ఎలా జరిగింది ?

బస్సులోని ఓ ప్రయాణికుడు Passenger వాష్‌రూమ్‌కు వెళ్లాలని చెప్ప‌డంతో బ‌స్సు డ్రైవ‌ర్ ఆగి ఉన్న లారీ వెన‌క బ‌స్సు ఆపాడు. అయితే ప్రయాణికుడు బస్సు దిగిన కొద్దిసేపటికే వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో లారీ బస్సును బలంగా ఢీకొట్టింది.

ముందున్న బస్సును గమనించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఢీకొట్టిన తీవ్రతకు రెండు లారీల మధ్య బస్సు పూర్తిగా ఇరుక్కుపోయి ధ్వంసమైంది. బస్సులో వెనుక భాగంలోని F4 మరియు F6 బెర్త్‌ల్లో ఉన్న బద్రీనాథ్, హరిత అనే ఇద్దరు ఈ ప్రమాదంలో ఘటనాస్థలంలోనే మృతి చెందారు.

యాదృచ్ఛికంగా, హరిత మొదటగా F2 బెర్త్‌లో ఉండాల్సి ఉండగా, ప్రయాణం ప్రారంభమైన తరువాత F4 బెర్త్‌కు మారింది. ఇదే సమయంలో F4లో ఉన్న నరసింహారెడ్డి ప్రాణాలతో బయటపడగా, F4కి మారిన హరిత దురదృష్టవశాత్తు మృతి చెందింది.

ఇద్దరూ హైదరాబాద్‌ ఉప్పల్ Uppal ప్రాంతం నుంచి బస్సు ఎక్కినట్లు స‌మాచారం. అయితే వారి పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదని పోలీసులు తెలిపారు. మృతి చెందినవారి లేదా గాయపడినవారి కుటుంబ సభ్యులు 9121101166 నెంబర్‌కు సంప్రదించాలని కోరారు.

ప్రమాద తీవ్రతతో బస్సు పూర్తిగా ధ్వంసమైపోయి, లోపల ఉన్న కొంతమంది ప్రయాణికులు ఇరుక్కుపోయారు. స్థానికులు, పోలీసులు వారిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. గాయపడిన వారిని ఆళ్లగడ్డ, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు.

ప్రమాద స్థలాన్ని నంద్యాల ఎస్పీ సునీల్ శరన్, డీఎస్పీ ప్రమోద్, సీఐ మురళీధర్ రెడ్డి పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ తాజా ప్రమాదంతో ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సుల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.