అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Srushti Clinic | సరోగసి (Surrogacy) పేరుతో మోసాలకు పాల్పడ్డ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ క్లినిక్ పేరిట డాక్టర్ (Doctor Namratha) నమ్రత ఎంతో మందిని మోసం చేసిన విషయం తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల్లో సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కేసు గతంలో సంచలనం సృష్టించింది. డాక్టర్ నమ్రత తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో సైతం సృష్టి క్లినిక్‌లు ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేశారు. ఐవీఎఫ్ (IVF) కోసం తన దగ్గరకు వచ్చే వారిని సరోగసి వైపు ఆమె మళ్లించేది. అయితే సరోగసి ద్వారా కాకుండా ఇతరుల పిల్లలను ఆ దంపతులకు అప్పగించేది. సరోగసి పేరిట వారి నుంచి రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వసూలు చేసింది. పేద దంపతులు, చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాల దగ్గర నుంచి పిల్లలను కొనుగోలు చేసి దంపతులకు ఇచ్చేది. ఈ వ్యవహారంలో గతంలో ఓ జంట ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) కేసు నమోదు చేసి ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతతో పాటు పలువురిని అరెస్ట్ చేశారు.
Srushti Clinic | భారీగా లావాదేవీలు
సరోగసి పేరుతో పిల్లల ట్రాఫికింగ్‌కు పాల్పడ్డ సృష్టి క్లినిక్‌పై ఈడీ (ED) తాజాగా కేసు నమోదు చేసింది. సృష్టి క్లినిక్ నిర్వాహకులు 4 నెలల్లో రూ.500 కోట్ల లావాదేవీలు జరిపినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఫెర్టిలిటీ సెంటర్లు పెట్టి సరోగసి పేరుతో వ్యాపారం నిర్వహించినట్లు పేర్కొన్నారు. సరోగసి పేరుతో పిల్లలు లేనివారి నుంచి రూ.50 లక్షల వరకు వసూళ్లు చేశారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద దంపతులను ట్రాప్ చేసి పిల్లల్ని కొనుగోలు చేసిన సృష్టి క్లినిక్ నిర్వాహకులు దగ్గరకు వచ్చే కస్టమర్స్‌కు అప్పగించేవారు. ఆ పిల్లలు సరోగసితో పుట్టారని చెప్పి రూ.50 లక్షల వరకు వసూలు చేసేవారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన ఈడీ త్వరలో డాక్టర్ నమ్రతను విచారించనుంది.
Srushti Clinic | వారి ప్రమేయం..!
సృష్టి క్లినిక్ వ్యవహారంలో.. విశాఖపట్నం కేంద్రంగానే పెద్ద ఎత్తున పిల్లల విక్రయాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిందితురాలు నమ్రతతో కలిసి 1988లో ఆంధ్ర వైద్య కళాశాల (Andhra Medical College)లో వైద్యవిద్య చదివిన పలువురు డాక్టర్లకు ఇందులో ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేయగా.. ఒకరు బెయిల్‌పై బయటకు వచ్చారు. ముగ్గురు అరెస్ట్ కావడంతో ఆ బ్యాచ్‌కు చెందిన పలువురు ఫోన్లను స్విఛ్ ఆఫ్ చేసుకున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు ఇంకా చాలా మంది నమ్రతకు సహకరించారని అనుమానిస్తున్నారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు.