అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Minister Rajanarsimha | తెలంగాణను తలసేమియా (Thalassemia) రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపునిచ్చారు. తలసేమియా అండ్ సికిల్‌సెల్ (Sickle cell) సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏసియన్ తలసేమియా కాన్‌క్లేవ్‌లో మాట్లాడారు.
తలసేమియా, సికిల్‌సెల్ ఎనీమియా, హీమోఫీలియా వంటి వ్యాధులు బాధిత కుటుంబాలను, సమాజాన్ని జీవితకాలం వెంటాడే తీవ్రమైన సవాళ్లు అని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రక్తసంబంధీకుల మధ్య వివాహాలు (మేనరికం) చేసుకోవడంతో తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఈ జన్యుపరమైన వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఎక్కువగా ఉందన్నారు.
Minister Rajanarsimha | రోగులకు పింఛన్ అందిస్తాం
ఈ వ్యాధుల నియంత్రణకు, బాధితుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. ఆరోగ్యశ్రీ (Arogya Sri) కింద ఉచితంగా చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. తలసేమియా బాధితులకు నిరంతర వైద్య సేవలు అందించేందుకు ఇప్పటికే ఆదిలాబాద్, నిజామాబాద్ (Nizamabad), వరంగల్, ఖమ్మం జిల్లాల్లో డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. త్వరలో ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్‌లలో కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
సికిల్‌సెల్ వ్యాధిని గుర్తించేందుకు రాష్ట్రంలో ఇప్పటివరకు 11 లక్షల మందికి పైగా స్క్రీనింగ్ పూర్తి చేశామని మంత్రి పేర్కొన్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్స అందిస్తున్నామని తెలిపారు. నిమ్స్ హాస్పిటల్‌లో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి అత్యాధునిక చికిత్సలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. తలసేమియా, సికిల్ సెల్ పేషెంట్లు అందరికీ పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.