The Raja Saab Movie Review : ది రాజా సాబ్ మూవీ రివ్యూ.. ప్ర‌భాస్ హార‌ర్ థ్రిల్ల‌ర్ ఎలా ఉందంటే..!

The Raja Saab Movie Review : మూవీ : ది రాజా సాబ్ నటీనటులు: ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, సంజయ్ దత్, జరినా వహాబ్ తదితరులు సినిమాటోగ్రాఫర్: ఫలని కార్తీక్ ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు సంగీతం: తమన్ నిర్మాత: టీజీ విశ్వప్రసాద్ దర్శకుడు: మారుతి పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ సలార్‌ , కల్కి 2898ఏడీతో బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్స్ అందుకోగా, ఆ త‌ర్వాత ఆయ‌న నుంచి వ‌చ్చిన […]

The Raja Saab Movie Review : మూవీ : ది రాజా సాబ్

నటీనటులు: ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, సంజయ్ దత్, జరినా వహాబ్ తదితరులు
సినిమాటోగ్రాఫర్: ఫలని కార్తీక్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: తమన్
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్
దర్శకుడు: మారుతి

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ సలార్‌ , కల్కి 2898ఏడీతో బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్స్ అందుకోగా, ఆ త‌ర్వాత ఆయ‌న నుంచి వ‌చ్చిన చిత్రం ది రాజాసాబ్‌.  అప్ప‌టి వ‌ర‌కు ప్రభాస్‌ యాక్షన్‌ సినిమాలతో మెప్పించ‌గా, తాజాగా ఆయన హర్రర్‌ సినిమా చేయడం ప్రత్యేకత. ఫాంటసీ హర్రర్ కామెడీగా మారుతి దీన్ని రూపొందించారు. ఇందులో మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి పండగ సందర్భంగా విడుద‌లైన ఈ చిత్రంతో ప్రభాస్ హిట్ కొట్టారా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

The Raja Saab Movie Review : క‌థ‌:

రాజు (ప్రభాస్)కు ఈ ప్రపంచంలో నానమ్మ గంగమ్మ (జరీనా వాహెబ్) తప్ప ఇంకెవరూ లేరు. అల్జీమర్స్‌తో బాధపడుతున్నప్పటికీ, కొన్నేళ్ల క్రితం దూరమైన తన భర్త కనకరాజు (సంజయ్ దత్)ను మాత్రం గంగమ్మ ఎప్పటికీ మర్చిపోదు. ఆయన ఎప్పుడో ఒకరోజు తిరిగి వస్తాడన్న ఆశతోనే జీవిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో కనకరాజు హైదరాబాద్‌లో ఉన్నాడన్న సమాచారం రాజుకు తెలుస్తుంది. నానమ్మ కోరికను నెరవేర్చాలన్న తపనతో రాజు తాతయ్యను వెతకడానికి హైదరాబాద్‌కు బయలుదేరతాడు. హైదరాబాద్‌లో అడుగుపెట్టిన రాజు అనుకోకుండా నర్సాపూర్ ఫారెస్ట్‌లోని రహస్యమైన కోటలోకి చేరతాడు. అక్కడికి వచ్చినవారెవరూ బయటకు వెళ్లకుండా కనకరాజు అనేక విధాలుగా ఆటలాడతాడు. అసలు ఆ కోట వెనుక ఉన్న రహస్యం ఏమిటి? కనకరాజు నిజంగా కోరేది ఏంటి? అనేది తెరపై తెలుసుకోవాల్సిందే.

ఈ ప్రయాణంలో రాజు జీవితంలోకి అనిత (రిద్ధి కుమార్), భైరవి (మాళవికా మోహనన్), బ్లేస్సీ (నిధి అగర్వాల్) ప్రవేశిస్తారు. ముగ్గురిలో రాజు హృదయాన్ని గెలుచుకున్నది ఎవరు? ఇక దేవనగరి సంస్థానానికి చెందిన వారసురాలు గంగా దేవి (అమ్ము అభిరామి)కి, రాజుకు ఉన్న సంబంధం ఏమిటి? చివరకు రాజు అలియాస్ ‘రాజా సాబ్’ ఆ భయంకర కోట నుంచి బయటపడగలిగాడా? లేక ఆ కోటే అతడి గమ్యమయ్యిందా? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

న‌టీన‌టుల ప‌ర్‌ఫార్మెన్స్:

ఈ సినిమాతో ప్రేక్షకులు చాలాకాలం తర్వాత వింటేజ్ ప్రభాస్‌ని చూసే అవకాశం పొందారు. ఏ పరిస్థితినైనా సరదాగా తీసుకుంటూ, వెటకారం మేళవించిన బాడీ లాంగ్వేజ్‌తో ఆయన పాత్ర ఆకట్టుకుంటుంది. నాయనమ్మ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే మనవడిగా, ముగ్గురు భామల మధ్య చిక్కుకున్న ప్రేమికుడిగా, తాత నిజస్వరూపం తెలుసుకున్న తర్వాత అతడిని అంతమొందించాలన్న పట్టుదలతో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడే యోధుడిగా ప్రభాస్ అద్భుతంగా అలరించారు. ముఖ్యంగా ఆయన లుక్, మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ ఇప్పటివరకు చూడని విధంగా కొత్తగా అనిపిస్తాయి.

ఇటీవల ప్రభాస్ నుంచి వరుసగా వచ్చిన యాక్షన్ సినిమాలతో కాస్త బోర్ ఫీలైన ప్రేక్షకులకు ఈ చిత్రం ఫ్రెష్ బ్రిత్ ఆఫ్ ఎయిర్‌లా అనిపిస్తుంది. మరోవైపు కనకరాజుగా సంజయ్ దత్ తనదైన విశ్వరూపం చూపించారు. డైలాగులు తక్కువగా ఉన్నప్పటికీ, తన హావభావాలతోనే పాత్రకు బలాన్ని చేకూర్చారు. ప్రభాస్ నాయనమ్మగా నటించిన జరీనా వాహెబ్ భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. సినిమా మొత్తం సాధారణ మహిళగా కనిపించిన ఆమె, క్లైమాక్స్‌లో రాణిగా ఎంట్రీ ఇవ్వడం హైలైట్‌గా నిలుస్తుంది.

హీరోయిన్లుగా నటించిన నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్‌ కు గ్లామర్ ప్రదర్శన తప్ప కథలో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. ముగ్గురిలో మాళవికా మోహనన్‌కు కాస్త ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. గ్లామర్ విషయంలో మాత్రం ఎవ్వరూ తగ్గలేదు. సముద్రఖని పాత్రను దర్శకుడు పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాడన్న భావన కలుగుతుంది. అలాగే వీటీవీ గణేష్, ప్రభాస్ శ్రీను, సప్తగిరి, సత్యల కామెడీ పెద్దగా నవ్వించలేకపోయింది. బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ సైకియాట్రిస్ట్ పద్మభూషణ్‌గా కీలక పాత్రలో కనిపించి కథకు ఆసక్తిని జోడించారు.

టెక్పిక‌ల్ ప‌ర్‌ఫార్మెన్స్:

టీజర్ విడుదల సమయంలో గ్రాఫిక్స్‌పై వచ్చిన విమర్శలను మేకర్స్ సీరియస్‌గా తీసుకుని మెరుగైన అవుట్‌పుట్ ఇస్తారని ఆశించిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో గ్రాఫిక్స్ వర్క్ స్పష్టంగా నాసిరకంగా కనిపిస్తుంది. మొసలి ఫైట్ సీక్వెన్స్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందింది.సినిమా నిడివి ఏకంగా 3 గంటల 9 నిమిషాలు ఉండటంతో అనవసరమైన సన్నివేశాలు ల్యాగ్‌గా మారి, చాలాచోట్ల బోర్ కొట్టినట్లు అనిపిస్తుంది. దర్శకుడు మారుతి స్క్రీన్‌ప్లేను ఇంకాస్త ఎంగేజింగ్‌గా తీర్చిదిద్దుకుని ఉంటే సినిమా మరింత బలంగా నిలిచేది.

సంగీత దర్శకుడు తమన్ అందించిన మ్యూజిక్ కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. సాధారణంగా నేపథ్య సంగీతంతో సినిమాను నిలబెట్టే తమన్, ‘రాజాసాబ్’లో మాత్రం అవసరమైన చోట కన్నా అనవసరమైన దరువులే ఎక్కువగా వినిపిస్తాయి. ఫస్ట్ హాఫ్‌లో పాటలు, ఫైట్స్‌తో ప్లేస్‌మెంట్‌ను సెట్ చేసుకునే ప్రయత్నం కనిపించినా, అవి కథను ముందుకు నడిపించడంలో పెద్దగా సహాయపడలేదు. పాటలు రన్‌టైమ్‌ను మాత్రమే పెంచినట్లు అనిపించాయి. హడావిడి ఎక్కువ… ఔట్‌పుట్ మాత్రం తక్కువ అన్నట్టుగానే తమన్ మ్యూజిక్ ఉంటుంది.

కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ మాత్రం గ్రాండ్‌గా కనిపిస్తుంది. ముగ్గురు హీరోయిన్లకు కథలో పెద్ద స్కోప్ లేకపోయినా, తన కెమెరా లెన్స్‌కు మాత్రం దర్శకుడు మంచి పనిపెట్టారు. ప్రభాస్ లుక్ విషయంలో కూడా భిన్నత కనిపిస్తుంది. కొన్ని షాట్స్‌లో చాలా హ్యాండ్సమ్‌గా కనిపిస్తే, మరికొన్ని చోట్ల మాత్రం లుక్‌పై సందేహం కలుగుతుంది. ఒక్కో సన్నివేశంలో ఒక్కోలా కనిపించడం కంటిన్యూయిటీ లోపంగా అనిపిస్తుంది. 3 గంటల 9 నిమిషాల రన్‌టైమ్ ఈ సినిమాకు అతిపెద్ద మైనస్. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు కనీసం అరగంటైనా ట్రిమ్ చేసి ఉంటే ప్రేక్షకులకు కాస్త రిలీఫ్ లభించేది. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ కోట్లాది రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, ఆ ఖర్చుకు తగ్గ పూర్తి స్థాయి అవుట్‌పుట్‌ను దర్శకుడు మారుతి అందించలేకపోయారు.

ప్ల‌స్ పాయింట్స్:

ప్ర‌భాస్
సినిమాటోగ్ర‌ఫీ
మొస‌లి ఫైట్
క్లైమాక్స్ ఎపిసోడ్

మైన‌స్ పాయింట్స్:

ర‌న్ టైమ్
సంగీతం
ఎడిటింగ్
కొన్ని స‌న్నివేశాలు
స్క్రీన్ ప్లే

విశ్లేష‌ణ‌:

ఎంత పెద్ద స్టార్ ఇమేజ్ ఉన్న హీరోనైనా నిలబెట్టేది కథే. కథ కోసం హీరో ఉండాలి గానీ, హీరో ఇమేజ్ కోసం కథను కలగలిపితే ఫలితం ‘రాజాసాబ్’లాగే తయారవుతుంది . కథ మొదట సరదాగా సాగినా, మెల్లగా అది మనసు లోతుల్లోకి చొచ్చుకుపోతుంది. అసలు భయం దెయ్యాల్లో కాదు… మనిషి మనసులోనే దాగి ఉందని కోట చెప్పడం మొదలుపెడుతుంది. కనకరాజు అనే వ్యక్తి నిజంగా ఎవరు? రాక్షసుడా? బాధితుడా? లేక రాజుకే ప్రతిబింబమా?చివరకు క్లైమాక్స్‌లో కథ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. ఇప్పటివరకు చూసినదంతా ఒక ఆటలా అనిపిస్తుంది. కానీ ఆ ఆట వెనుక ఉన్న నిజం మాత్రం గట్టిగా తాకుతుంది. రాజు బయటపడతాడా? లేక ఆ కోటలోనే మరో కథగా మిగిలిపోతాడా?

ఈ కథ నవ్విస్తుంది… భయపెడుతుంది… కానీ చివరికి ఒక ప్రశ్న వదిలేస్తుంది.భ‌యానికంటే ప్రమాదకరం మనసా? లేక జ్ఞాపకాలా? ఇక్కడితో కథ ముగిసినా… ఇంకో అధ్యాయం మొదలయ్యే సంకేతం మాత్రం మిగిలే ఉంటుంది. మారుతి హారర్ లో కొత్త కాన్సెప్ట్ ట్రై చేశాడు కాని అనుకున్నంత ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించ‌లేక‌పోయాడు

రేటింగ్‌: 2.5

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.