అక్షరటుడే, వెబ్‌డెస్క్ : The Raja Saab | సినిమా టికెట్ల రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే రేట్లు ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించింది.
రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన రాజాసాబ్ శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. తెలంగాణలో ఈ సినిమా ప్రీమియర్ షోలతో పాటు, టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతించాలని నిర్మాత ప్రభుత్వాన్ని కోరారు. అయితే ప్రీమియర్ షోలకు (premiere shows) అనుమతించని ప్రభుత్వం.. టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రం అర్ధరాత్రి ఓకే చెప్పింది. తొలి మూడు రోజులు సింగిల్ స్క్రీన్‌లలో రూ.105, మల్టీప్లెక్స్‌ల్లో రూ.132 ధర పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. అలాగే జనవరి 12 నుంచి 18 వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.62, మల్టీప్లెక్స్‌ల్లో రూ.89 రేటు పెంచుకోవచ్చని చెప్పింది. అయితే టికెట్ ధర పెంపుతో వచ్చిన లాభాల్లో 20 శాతం ఫిలిం ఫెడరేషన్‌కు ఇవ్వాలని ఆదేశాలిచ్చింది.
The Raja Saab | కోర్టులో పిటిషన్
రాజాసాబ్ టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నిబంధనలకు విరుద్ధంగా టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇస్తున్నారని పిటిషనర్ వాదించారు. టికెట్ రేట్లు పెంచుకోవడానికి మెమో జారీ చేసే అధికారంర హోంశాఖ కార్యదర్శికి లేదని ఆయన పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టికెట్ రేట్లు పెంచబోమని మంత్రి కూడా చెప్పారని, అయినా పెంపునకు అనుమతిస్తూ ఎందుకు మెమోలు ఇస్తున్నారని ప్రశ్నించింది. తెలివిగా మెమోలు ఎందుకు జారీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
The Raja Saab | మంత్రి చెప్పినా..
రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్లు పెంచబోమని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) గతంలో ప్రకటించారు. రేట్లు పెంచాలని తమను ఎవరు కలువద్దని కోరారు. తమది ప్రజా ప్రభుత్వం అని చెప్పారు. అయితే తాజాగా మళ్లీ సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ప్రభుత్వం మెమో జారీ చేయడం గమనార్హం.