అక్షరటుడే, వెబ్‌డెస్క్: The Raja Saab | రాజాసాబ్ నిర్మాతకు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) షాక్ ఇచ్చింది. టికెట్ రేట్ (ticket price) పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను సస్పెండ్ చేసింది. పాత ధరల ప్రకారమే టికెట్లు విక్రయించాలని ఆదేశించింది.
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాజాసాబ్ (The Raja Saab) శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. తెలంగాణలో ఈ సినిమా ప్రీమియర్ షోలతో పాటు, టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతించాలని నిర్మాత ప్రభుత్వాన్ని కోరారు. అయితే ప్రీమియర్ షోలకు అనుమతించని ప్రభుత్వం.. టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రం అర్ధరాత్రి ఓకే చెప్పింది. తొలి మూడు రోజులు సింగిల్ స్క్రీన్‌లలో రూ.105, మల్టీప్లెక్స్‌ల్లో రూ.132 ధర పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. జనవరి 12 నుంచి 18 వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.62, మల్టీప్లెక్స్‌ల్లో రూ.89 రేటు పెంచుకోవచ్చని చెప్పింది.
The Raja Saab | హైకోర్టు ఆగ్రహం
టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వాదనలు విన్న న్యాయస్థానం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టికెట్ రేట్లు పెంచబోమని మంత్రి కూడా చెప్పారని, అయినా పెంపునకు అనుమతిస్తూ ఎందుకు మెమోలు ఇస్తున్నారని ప్రశ్నించింది. ఆ మెమోను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. పాత రేట్లకే టికెట్లు విక్రయించాలని సూచించింది. ఇకపై ఎలాంటి మెమోలు ఇవ్వొద్దని స్పష్టం చేసింది. టికెట్ రేటు పెంచాలనుకుంటే జీవో 120 ప్రకారం రూ.350 మించకూడదని తెలిపింది.