అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR | రాష్ట్ర ప్రభుత్వం (State Government) రియల్ ఎస్టేట్ బ్రోకర్లా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులతో శుక్రవారం ఆయన సమావేశం అయ్యారు.
హైదరాబాద్ (Hyderabad)లోని ఉర్దూ యూనివర్సిటీకి చెందిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే కుట్ర చేస్తోందని కేటీఆర్ అన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్కు తలమానికంగా ఉన్న ఉర్దూ యూనివర్సిటీ (Urdu University)ని కాంగ్రెస్ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. యూనివర్సిటీని రియల్ ఎస్టేట్ అవసరాల కోసం వాడాలనుకుంటుంటోందని ఆరోపించారు. సీరియల్ కిల్లర్ల మాదిరి సీరియల్ ల్యాండ్ స్నాచర్గా మారిందన్నారు.
KTR | వర్సిటీల భూములపై కన్ను
అన్ని యూనివర్సిటీ భూములను గుంజుకోవడం ఒక ప్రక్రియగా కాంగ్రెస్ పెట్టుకుందన్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ భూమిని హైకోర్టు (High Court) పేరు చెప్పి తీసుకుందన్నారు. 400ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూమిని గుంజుకునే ప్రయత్నం చేయగా.. కోర్టులు అడ్డుకున్నాయని తెలిపారు. ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీ భూములపై కన్ను వేసిందన్నారు. ఈ ప్రభుత్వం విద్యా సంస్థల భూములను తీసుకుని రియల్ ఎస్టేట్ బ్రోకర్ (Real Estate Broker) మాదిరిగా వ్యవహరిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు.
KTR | నోటిఫికేషన్లు వేయాలి
నిరుద్యోగులపై జరిగిన లాఠీఛార్జ్ను కేటీఆర్ ఖండించారు. నోటిఫికేషన్లు ఏవి అని నిలదీసినందుకు వారిని దారుణంగా తిడుతూ ఘోరంగా లాఠీ ఛార్జ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మోసం చేస్తోందన్నారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ అంశంపై స్పందించి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయించాలని డిమాండ్ చేశారు.
