అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ONGC Blowout | అంబేడ్కర్ కోనసీమ జిల్లా (Konaseema District) ఇరుసుమండలో మంటలు ఆగిపోయాయి. ఓఎన్జీసీ గ్యాస్ బ్లో అవుట్‌తో ఆరు రోజులుగా మంటలు ఎగిసిపడ్డ విషయం తెలిసిందే.
ఇరుసుమండలోని మోరీ -5 ఆయిల్ వెల్ వద్ద సోమవారం మధ్యాహ్నం సమయంలో గ్యాస్ లీకైంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి ఓఎన్జీసీ సిబ్బంది అక్కడి నుంచి పరుగులు తీశారు. ఆ రోజు నుంచి అధికారులు, ఓఎన్జీసీ సిబ్బంది మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలో శనివారం ఉదయం మంటలు పూర్తిగా ఆగిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది, ఓఎన్జీసీ అధికారులు (ONGC Officials) వెల్ క్యాపింగ్ చేశారు. దీంతో మంటలు అదుపులోకి వచ్చాయి.
ONGC Blowout | శకలాల తొలగింపు
భూమిలో నుంచి గ్యాస్ ఒత్తిడి ఒక్కసారిగా పెరగడంతో బ్లో అవుట్ చోటు చేసుకుంది. దీంతో మంటలు ఎగిసిపడ్డాయి. అధికారులు ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించి సహాయక చర్యలు చేపట్టారు. మంటల తీవ్రతకు డ్రిల్లింగ్ రిగ్, ఇతర యంత్రాలు కాలిపోయాయి. అధికారులు ఆ శకలాలను తొలగించారు. మంటలను అదుపు చేయడానికి వాటర్ కర్టెన్ (Water Curtain) పద్ధతి ఉపయోగించారు. ఆరు రోజులుగా.. నిరంతరం మంటలపై నీటిని చల్లుతూ ఉష్ణోగ్రతలు తగ్గించారు. అనంతరం బావి వద్దకు చేరుకొని గ్యాస్ ఒత్తిడిని తగ్గించే చర్యలు చేపట్టారు. మంటలు అదుపులోకి రావడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.