అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేశారు. దేశంలో లక్షల ఓట్లను ఈసీ తొలగించిందన్నారు.
రాహుల్ గాంధీ కొంతకాలంగా ఓటు చోరీ పేరిట ఈసీపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో ఆయన గురువారం మాట్లాడారు. కొందరు వ్యవస్థను హైజాక్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశంలో లక్షలాది మంది ఓటు హక్కును కావాలనే తొలగించారన్నారు. ఎన్నికల సంఘం (Election Commission) ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వారిని కాపాడుతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
Rahul Gandhi | కాంగ్రెస్ బలంగా ఉన్నచోట
కాంగ్రెస్ బలంగా ఉన్నచోట ఓట్లను తొలగిస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు. ఓట్ల తొలగింపుపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly elections) 6,800 ఓట్లు తొలగించారని చెప్పారు. అధికారులకు తెలియకుండా ఓట్లు ఎలా పోతాయని ఆయన ప్రశ్నించారు. కొందరు వ్యవస్థలను హైజాక్ చేసి ప్రజలకు తెలియకుండా వారి ఓటు హక్కు తొలగిస్తున్నారని ఆరోపించారు. ఓట్లు తొలగించాలని ఓటర్ల పేరిట దరఖాస్తు చేస్తున్నారని చెప్పారు. అంతేగాకుండా ఇతర రాష్ట్రాల ఫోన్ నంబర్లు ఉపయోగించి ఓట్లు తొలగించారన్నారు. కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లను తీసేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Rahul Gandhi | హైడ్రోజన్ బాంబు పేలుస్తా
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై (CEC Gyanesh Kumar) రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వారిని ఈసీ కాపాడుతోందని మండి పడ్డారు. నకిలీ దరఖాస్తులు, ఫేక్ లాగిన్ ఐడీలతో (fake login IDs) ఓటర్ల పేర్లను తొలగించారన్నారు. సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఏర్పాటు చేసి, ప్లాన్ ప్రకారం ఓట్లు తొలగిస్తున్నారని చెప్పారు. ఓట్లు తొలగించాలని సూర్యకాంత్ అనే వ్యక్తి పేరిట 12 నిమిషాల వ్యవధిలో 14 దరఖాస్తులు వెళ్లాయని ఆయన చెప్పారు. దళితులు, ఆదివాసీల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలోని రాజురా నియోజకవర్గంలో 6,851 నకిలీ ఓటర్లను కలిపారని ఆయన ఆరోపించారు. ఓటు చోరీపై కాసేపట్లో హైడ్రోజన్ బాంబు పేలుస్తానని ఆయన ప్రకటించారు.