అక్షరటుడే, వెబ్‌డెస్క్: Weather Updates | బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. తీవ్ర వాయుగుండం బలహీనపడి తమిళనాడు (Tamil Nadu) వైపు పయనిస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
నైరుతి బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారిన విషయం తెలిసిందే. ఇది తుపాన్ (cyclone) మారే అవకాశం ఉందని అధికారులు భావించారు. అయితే బలహీనపడి వాయుగుండంగా మారింది. శ్రీలంకకు ఈశాన్యంగా ముల్లయిట్టివుకు సమీపంలో తీరం దాటింది. దీంతో ఏపీకి భారీ వర్షాల ముప్పు తప్పింది.
Weather Updates | తమిళనాడులో వర్షాలు..
వాయుగుండం ప్రస్తుతం దక్షిణ తమిళనాడు వైపు కదులుతోంది. మరికొన్ని గంటల్లో ఇది అల్పపీడనంగా మారనుంది. అయితే దీని ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో సైతం రెండు రోజులుగా జల్లులు పడుతున్నాయి. ఈ రోజు సైతం తిరుపతి, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
Weather Updates | తగ్గిన చలి
వాయుగుండం ఎఫెక్ట్‌తో శనివారం తెలంగాణలో తీవ్రమైన చలిగాలులు వీచాయి. ఆకాశం మేఘావృతమై ఉంది. అయితే వాయుగుండం తీరం దాటడంతో రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గింది. వారం రోజుల పాటు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని అధికారులు తెలిపారు.