అక్షరటుడే, వెబ్డెస్క్ : Mumbai | 1993 ముంబై పేలుళ్ల కేసు (Mumbai Blast Case) నిందితులు, 26/11 ఉగ్రదాడి దాడిదారు అజ్మల్ కసబ్, అండర్వర్ల్డ్ డాన్ అబూ సలేం, అబూ జుందాల్, గ్యాంగ్‌స్టర్ అరుణ్ గావ్లి, నటుడు సంజయ్ దత్ సహా అనేక మంది నేరస్థులు, ఉగ్రవాదుల విచారణలకు సాక్ష్యంగా నిలిచిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పాత భవనం త్వరలో చరిత్రలో కలిసిపోనుంది.
ముంబైలోని (Mumbai) 117 ఏళ్ల పురాతన క్రైమ్ బ్రాంచ్ భవనం త్వరలో చరిత్రలో కలిసిపోనుంది. 1908లో ‘మలాడ్ స్టోన్స్’తో నిర్మించిన ఈ రెండంతస్తుల రాతి కట్టడంలో 1909 జూన్ 9న ఇంపీరియల్ పోలీస్ ఆఫీసర్ ఎఫ్.ఏ.ఎం.హెచ్. విన్సెంట్ ఆధ్వర్యంలో సీఐడీ కార్యాలయం (CID Office) ప్రారంభమైంది. అప్పటి నుంచి బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు అనేక కీలక దర్యాప్తులకు ఇది కేంద్రంగా నిలిచింది.
Mumbai | కీలక విచారణలకు వేదిక
- ఈ భవనం ముంబై పోలీస్ చరిత్రలో అత్యంత ప్రాధాన్యమైన కట్టడాల్లో ఒకటి.
- స్వాతంత్య్ర ఉద్యమ నేత బాలగంగాధర తిలక్ అరెస్టు
- 1993 ముంబై పేలుళ్ల దర్యాప్తు
- 26/11 ఉగ్రవాది అజ్మల్ కసబ్ విచారణ
- అండర్వర్ల్డ్ డాన్ అబూ సలేం, అబూ జుందాల్, ఛోటా రాజన్
- గ్యాంగ్‌స్టర్ అరుణ్ గావ్లి
- నటుడు సంజయ్ దత్ విచారణ
ఇలాంటి చరిత్రాత్మక కేసులన్నింటికీ ఈ భవనం ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. 1925లో సంచలనం సృష్టించిన బావ్లా హత్య కేసు కూడా ఇదే భవనంలో విచారించబడింది.
Mumbai | అత్యంత దయనీయంగా భవనం పరిస్థితి
ప్రస్తుతం ఈ భవనం తీవ్రమైన స్థితిలావస్థకు చేరుకుంది. నిర్మాణ ఆడిట్‌లో వెనుక భాగంలోని ఇనుప దూలాలు పూర్తిగా తుప్పుపట్టటంతో భవనం అసురక్షితమని తేలింది. మరమ్మతులు చేయలేని స్థితి రావడంతో భవనాన్ని కూల్చివేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.
ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ముంబై పోలీస్ (Mumbai Police) వ్యవస్థ విస్తరించింది. అయితే ప్రధాన కార్యాలయంలో స్థలం చాలా తక్కువ. ఈ భవనాన్ని మరమ్మత్తు చేయలేకపోవడంతో, కొత్త ఆధునిక భవనాన్ని నిర్మించబోతున్నామని తెలిపారు. పాత భవనం కూల్చివేసిన తర్వాత, అదే స్థలంలో ఆరు అంతస్తుల ఆధునిక కట్టడాన్ని నిర్మించనున్నారు.
ఇందులో క్రైమ్ బ్రాంచ్ కార్యాలయాలు, ఆధునిక CCTV సర్వైలెన్స్ సెంటర్, పరిపాలనా విభాగాలు, సమావేశ మందిరాలు, సమావేశ గదులు ఉండనున్నాయి. నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు ప్రస్తుత క్రైమ్ బ్రాంచ్ (Crime Branch) యూనిట్లన్నీ కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలోని కొత్త పరిపాలనా భవనానికి మార్చనున్నారు. ఈ భవనానికి ముద్ర వేసిన పూర్వ అధికారులు చివరిసారి దీన్ని సందర్శించాలని భావిస్తున్నారని పోలీసు చరిత్రకారుడు దీపక్ రావు తెలిపారు. ఈ కట్టడంలో పనిచేసిన ప్రతి పోలీసు అధికారికి ఇది ఒక భావోద్వేగ స్థలం అని ఆయన పేర్కొన్నారు.
