అక్షరటుడే, వెబ్‌డెస్క్ : T20 World Cup | మెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల అయింది. వచ్చే ఏడాది జరగనున్న ఈ మెగా టోర్నీ వివరాలను ఐసీసీ (ICC) తాజాగా వెల్లడించింది. భారత్, శ్రీలంక దేశాల్లో టోర్నీని నిర్వహించనున్నారు.
టీ 20 వరల్డ్ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. అహ్మదాబాద్ (Ahmedabad)లో ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. మొత్తం 20 టీమ్‌లు తలపడనున్నాయి. ఐదు జట్లకు ఒక గ్రూప్ చొప్పున నాలుగు గ్రూప్‌లు ఏర్పాటు చేశారు. ప్రతి గ్రూప్ నుంచి టాప్ రెండు టీమ్‌లు సూపర్ – 8కి అర్హత సాధిస్తాయి.
చివరి టీ20 ప్రపంచ కప్‌ను అమెరికా(USA), వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ టోర్నీలో రోహిత్ నాయకత్వంలో భారత్ కప్ కొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌కు తన సొంతగడ్డపై మెజారిటీ మ్యాచ్‌లు ఆడనుంది. ఈసారి సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత జట్టు బరిలోకి దిగుతోంది.
T20 World Cup | భారత్ మ్యాచుల వివరాలు..
ఫిబ్రవరి 7న భారతత్ యూఎస్ఏతో ముంబై వేదికగా తల పడుతుంది. 12న ఢిల్లీలో నమీబియాతో ఆడుతుంది. చిరకాల ప్రత్యర్థి పాక్‌తో 15న కొలొంబోలో మ్యాచ్ ఉండనుంది. ఫిబ్రవరి 18న అహ్మదాబాద్‌లో ఇండియా vs నెదర్లాండ్స్ మ్యాచ్ ఉంటుంది. భారత్ నాలుగు మ్యాచుల్లో పాకిస్థాన్ మాత్రమే బలమైన జట్టు కావడం గమనార్హం. కాగా పాకిస్థాన్ తన అన్ని మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడనుంది. భారత్, శ్రీలంక, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ స్టేట్స్, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఐర్లాండ్, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, నమీబియా, జింబాబ్వే, నేపాల్, ఓమన్, యూఏఈ జట్లు టోర్నీలో పాల్గొంటున్నాయి.
