అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Starlink services | భారత్‌లో శాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్ సేవలు (Communication services) త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
ఎలాన్ మస్క్‌కు elon musk చెందిన స్టార్ లింక్‌తో పాటు ఇతర గ్లోబల్ శాటిలైట్ కమ్యూనికేషన్ (Global Satellite Communication) సంస్థలు ఇండియాలో తమ సేవలు ప్రారంభించేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. భారత్ మార్కెట్‌కు అనుగూణంగా అత్యంత తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ డేటా ప్యాకేజీలు అందించేందుకు ఆయా సంస్థలు సిద్ధమవుతున్నాయి. అయితే, అందరి కంటే ముందే స్టార్‌లింక్ సేవలు(Starlink Services) ప్రారంభమయ్యే అవకాశముంది.
త్వరలోనే ఆ సంస్థ ఇండియాలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. స్టార్‌లింక్‌తో పాటు ఇతర శాట్‌కామ్ సంస్థలు తక్కువ ధరకే సేవలు అందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రారంభ డేటా ప్లాన్ ధర రూ.840కు మించి ఉండకపోవచ్చని కూడా భావిస్తున్నారు. ఈ మేరకు జాతీయ మీడియాలో విస్తృత కథనాలు వెలువడుతున్నాయి. భారత్‌లో స్పెక్ట్రమ్ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ.. అధిక కస్టమర్ బేస్ సాయంతో ఖర్చుల భారం తగ్గించుకోవాలని ఆయా సంస్థలు ప్రయత్నిస్తున్నాయని చెబుతున్నారు.
Starlink services | తక్కువ ధరకే అన్‌లిమిటెడ్..
ఇండియా లాంటి దేశాల్లో శాట్‌కామ్ సంస్థలకు ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. ఎందుకుంటే ట్రాయ్ నిబంధనల ప్రకారం ప్రస్తుతం నెలవారీ అర్బన్ యూజర్ చార్జీ రూ.500 చెల్లించాలి. ఇది కాక శాట్‌కామ్ సంస్థలు ఏజీఆర్‌పై 4 శాతం లెవీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఒక మెగాహెర్జ్ స్పెక్ట్రమ్‌కు 8 శాతం చొప్పున వార్షిక ఫీజు కూడా చెల్లించాల్సిందే. దీంతో, సంప్రదాయిక సర్వీసుల కంటే శాటిలైట్ సర్వీసులు(Satellite Services) ఖరీదైన వ్యవహారంగా మారాయి. ఇలా రకరకాల ఖర్చుల భారం తమపై ఉన్నప్పటికీ అంతర్జాతీయ శాట్‌కామ్ సంస్థలు మాత్రం వెనక్కుతగ్గట్లేదు. నిధుల లభ్యత సమృద్ధిగా ఉన్న స్టార్ లింక్ లాంటి సంస్థలు ఈ ఖర్చుల భారం తగ్గించుకునేందుకు కొత్త వ్యూహాలు పన్నుతున్నాయి.
‘‘స్పెక్ట్రమ్ ఖర్చు ఎంత ఎక్కువగా ఉన్నా ప్రారంభ ధర మాత్రం 10 డాలర్ల లోపే ఉండే అవకాశం ఉంది. వీలైనంత మంది కస్టమర్లను చేర్చుకుని స్పెక్ట్రమ్(Spectrum) భారం తగ్గించుకునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయని’’ ఓ కన్సల్టింగ్ సంస్థ అధికారి వెల్లడించారు. పలు అంతర్జాతీయ సంస్థలు శాటిలైట్ కమ్యూనికేషన్ ధరలను ఎంతగా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నా.. సంప్రదాయిక బ్రాడ్ బ్యాండ్ ధరలతో పోలిస్తే 8 నుంచి 17 రెట్లు ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అయితే, బ్రాడ్ బ్యాండ్ సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో శాటిలైట్ సేవలను విస్తృత స్థాయిలో అందుబాటులోకి తెచ్చి ఖర్చులు తగ్గించుకుంటూ లాభాల బాట పట్టాలని ఆయా సంస్థలు భావిస్తున్నాయి
Starlink Services | స్టార్‌లింక్‌కు సవాళ్లెన్నో..
భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఉవ్విళ్లూరుతున్న స్టార్‌లింక్(Starlink)కు కొన్ని సాంకేతిక సవాళ్లు ప్రతికూలంగా మారాయి. ప్రస్తుతం ఆ సంస్థకు భూసమీప కక్ష్యలో పరిభ్రమిస్తున్న 7 వేల శాటిలైట్లు ఉన్నాయి. వీటితో ప్రపంచవ్యాప్తంగా 4 మిలియన్ యూజర్లకు సేవలు అందించే అవకాశం ఉంది. ఇది భారత వినియోగదారుల అవసరాలకు ఏమాత్రం సరిపోదు. స్టార్‌లింక్ శాటిలైట్ల సంఖ్య 18 వేలకు చేరుకున్నా కూడా 1.5 మిలియన్ల మందికి మాత్రమే శాటిలైట్ సేవలు లభించే అవకాశం ఉంది. అదనపు శాటిలైట్లు ప్రయోగించేందుకు స్టార్‌లింక్‌కు ప్రభుత్వం నుంచి ఇన్‌స్పేస్ అనుమతులు అవసరం. ఇందుకోసం కొంత సమయం పట్టే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో యూజర్ల నుంచే వచ్చే డిమాండ్‌ను స్టార్‌లింక్ ఎలా అధిగమిస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.

