అక్షరటుడే, భీమ్‌గల్ : Mla Prashanth Reddy | క్రీడలు జీవితంలో ఎదురయ్యే గెలుపోటములను సమానంగా స్వీకరించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (MLA Vemula Prashanth Reddy) అన్నారు. ఆటలు మానసిక ధైర్యాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. భీమ్‌గల్ మండల (Bheemgal Mandal) కేంద్రంలో శనివారం 69వ ఎస్‌జీఎఫ్ (SGF) (School Games Federation) అంతర పాఠశాలల క్రీడాపోటీలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
Mla Prashanth Reddy | క్రీడలే భవిష్యత్తుకు బాటలు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి క్రీడాకారుల మార్చ్ఫాస్ట్ను తిలకించి.. వారినుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. ‘క్రీడలు విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు. గ్రామీణస్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదిగిన ఎందరో క్రీడాకారులు మనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. క్రీడల వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని.. శరీరం మన ఆధీనంలో ఉంటుందని వెల్లడించారు. నేటి యువత గంజాయి వంటి వ్యసనాల బారిన పడకుండా ఉండాలంటే వారిని క్రీడల వైపు మళ్లించాల్సిన అవసరం ఉంది” అని వేముల పేర్కొన్నారు.
Mla Prashanth Reddy | క్రీడా ప్రేమికుల కృషి అభినందనీయం
ఆర్థిక వనరులు ఉన్నా లేకున్నా.. అందరినీ ఏకంచేసి ఇలాంటి క్రీడోత్సవాలను నిర్వహించడం అంత సులభం కాదని ప్రశాంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. విద్యాసాగర్ రెడ్డి, రాజ్‌కుమార్, మల్లేష్ వంటి క్రీడా ప్రేమికులు, పీఈటీలు, ఉపాధ్యాయ బృందం కష్టపడి ఈ నియోజకవర్గంలో క్రీడలను ప్రోత్సహిస్తున్నారన్నారు. తన కుటుంబంలో తండ్రి, చెల్లెలు, తాను కూడా జాతీయ స్థాయి క్రీడాకారులమేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తే తన వంతు సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మార్చ్‌ఫాస్ట్‌లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఎమ్మెల్యే మెమోంటోలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాలల ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు (PETs), విద్యార్థులు పాల్గొన్నారు.