అక్షరటుడే, వెబ్‌డెస్క్: Soapnut | పూర్వ కాలంలో జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి ఒక్కరూ కుంకుడు కాయలనే వాడేవారు. కాలక్రమేణా మార్కెట్లో రకరకాల షాంపూలు రావడంతో కుంకుడు కాయల వాడకం కనుమరుగైపోయింది. కానీ, కుంకుడు కాయలలో ఉండే ‘శపోనిన్’ అనే సహజ సిద్ధమైన క్లీనింగ్ గుణం జుట్టునే కాకుండా, ఇంటిని కూడా శుభ్రం చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. నిపుణుల సూచనల ప్రకారం వీటిని వివిధ రకాలుగా ఎలా ఉపయోగించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లోనే సహజ సిద్ధమైన లిక్విడ్ సోప్: Soapnut | రసాయనాలు లేని సబ్బును వాడాలనుకునే వారికి ఇది మంచి ప్రత్యామ్నాయం. ఒక కప్పు నీటిలో రెండు కుంకుడు కాయలు వేసి సుమారు అరగంట పాటు బాగా మరగబెట్టాలి. అది పూర్తిగా చల్లారిన తర్వాత వడకట్టుకోవాలి. మీకు నచ్చిన మంచి వాసన వచ్చే అరోమా ఆయిల్ (Rosemary or Lavender) కొన్ని చుక్కలు కలిపి ఒక సీసాలో భద్రపరుచుకోవాలి. దీనిని స్నానం చేసేటప్పుడు సబ్బుకు బదులుగా వాడుకోవచ్చు. చర్మం మృదువుగా ఉండటంతో పాటు ఎటువంటి అలర్జీలు రావు.
అద్దాలను మెరిపించే గ్లాస్ క్లీనర్‌గా: Soapnut | కిటికీ అద్దాలు లేదా ఇంటి లోపల ఉండే గ్లాస్ వస్తువులను క్లీన్ చేయడానికి మార్కెట్లో దొరికే ఖరీదైన క్లీనర్ల అవసరం లేదు. ఒక టేబుల్ స్పూన్ కుంకుడు కాయ రసం, రెండు టేబుల్ స్పూన్ల వైట్ వెనిగర్, అర కప్పు నీళ్లు కలిపి ఒక స్ప్రే బాటిల్‌లో నింపుకోవాలి. దీనిని అద్దాల మీద స్ప్రే చేసి మెత్తని వస్త్రంతో తుడిస్తే, దుమ్ము మొత్తం తొలగిపోయి అద్దాలు కొత్త వాటిలా మెరుస్తాయి.
పట్టు వస్త్రాల సంరక్షణకు: Soapnut | ఖరీదైన పట్టు చీరలు లేదా జరీ దుస్తులను సాధారణ సోపులతో ఉతికితే అవి రంగు వెలిసిపోయి, త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంది. అందుకే కుంకుడు కాయల రసాన్ని తీసి, ఆ నీటిలో పట్టు వస్త్రాలను నానబెట్టి ఉతకాలి. దీనివల్ల వస్త్రాల మెరుపు తగ్గదు, అవి ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. మనం షాంపూ వాష్ చేసే వస్త్రాలన్నింటికీ ఈ సహజ పద్ధతిని వాడవచ్చు.
కిచెన్, బాత్‌రూమ్ క్లీనర్‌గా: Soapnut | వంటగదిలోని ప్లాట్‌ఫాం, వాష్ బేసిన్ లేదా బాత్‌రూమ్ టైల్స్ మీద పేరుకుపోయిన జిడ్డును వదిలించడానికి కుంకుడు కాయ రసానికి కొద్దిగా వెనిగర్ కలిపి వాడాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే చేసి కొద్దిసేపు ఆగి క్లీన్ చేస్తే మురికి సులభంగా వదిలిపోతుంది. ఇది పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, రసాయన వాసనలు లేకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుతుంది.