అక్షరటుడే, వెబ్డెస్క్ : Shamshabad | శంషాబాద్‌లో చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన స్థానికులను, బంధువులను తీవ్రంగా కలిచివేస్తోంది. భార్యని, ఆమె గర్భంలో ఉన్న కవలలను కోల్పోయిన విషాదాన్ని భరించలేక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
బెంగళూరు (Bangalore)కు చెందిన ముత్యాల విజయ్ (40), భార్య శ్రావ్య (35) ఏడాదిన్నర క్రితం శంషాబాద్‌లో స్థిరపడ్డారు. విజయ్ ఆర్జీఐఏ ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరు ప్రేమ వివాహం చేసుకోగా, అనంతరం కుటుంబ జీవితం సాఫీగా సాగింది. అయితే పిల్లల కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురుచూసిన దంపతులకు ఐవీఎఫ్ చికిత్స ఫలించి శ్రావ్య గర్భం దాల్చింది.
Shamshabad | తీవ్ర విషాదం..
కడుపులో కవలలు పెరుగుతున్నారని తెలిసి వారి ఆనందం అవధులు దాటింది. ఎనిమిది నెలల గర్భంతో శ్రావ్య ప్రసవం కోసం రోజులు లెక్కపెడుతోంది. అయితే 2025 నవంబర్ 16న రాత్రి శ్రావ్యకు అకస్మాత్తుగా కడుపులో తీవ్ర నొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు ఆమెను అత్తాపూర్ (Attapur)లోని ఒక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసి పిడుగులాంటి వార్త చెప్పారు. కవలలు గర్భంలోనే మృతి చెందారని చెప్పడంతో శ్రావ్య షాక్‌కు గురై స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను గుడిమల్కాపూర్ (Gudimalkapur)లోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స ఫలించలేదు. కొద్ది గంటల్లోనే శ్రావ్య కూడా ప్రాణాలు విడిచింది.
ఒకవైపు భార్య మరణం, మరోవైపు కన్నుమూసిన కవలలను చూసిన విజయ్ తీవ్రంగా మానసిక వేదనకు గురయ్యాడు. తన కలల కుటుంబం ఒక్కసారిగా శూన్యమైపోవడంతో జీవితం కొనసాగించడం తన వలన కాదనుకున్నాడో ఏమో కాని సోమవారం తెల్లవారుఝామున శంషాబాద్ (Shamshabad)లోని ఇంట్లోనే విజయ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దుర్ఘటన కుటుంబ సభ్యులను, స్థానికులను విషాదంలో ముంచేసింది.
