Homeజిల్లాలునిజామాబాద్​Science Fair | విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం

Science Fair | విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం

విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి అన్నారు. బోధన్​ పట్టణంలో సైన్స్​ఫేర్​ను ప్రారంభించారు.

- Advertisement -

అక్షరటుడే, బోధన్: Science Fair | విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి (Government advisor Sudarshan Reddy) అన్నారు.

జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని విజయ మేరీ హైస్కూల్​లో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి సైన్స్ ఫేర్, ఇన్ స్పైర్ ప్రదర్శనను సోమవారం ఆయన ప్రారంభించారు. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డితో (Collector T. Vinay Krishna Reddy) కలిసి సైన్స్​ఫేర్​లో విద్యార్థులు రూపొందించిన వైజ్ఞానిక ప్రదర్శన నమూనాలను ఎంతో ఆసక్తితో తిలకించారు.

సుస్థిర అభివృద్ధి, లాభదాయకమైన కూరగాయల పంటల సాగు, సోలార్ వినియోగం, పర్యావరణ పరిరక్షణకు ఉపకరించే సాధనాల ప్రయోగాలను ఆయన తిలకించారు. కాలుష్య నియంత్రణ, ఆరోగ్యకరమైన ఆహారం (healthy food) తదితర అంశాలపై సరికొత్త ఆలోచనలతో సృజనాత్మకతను జోడిస్తూ ప్రదర్శనలు రూపొందించిన విద్యార్థులను అభినందించారు. రాష్ట్ర, జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనల్లోనూ ప్రతిభను చాటి జిల్లా ప్రతిష్టను పెంపొందించాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సూచించారు.

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించే విధంగా సైన్స్​ఫేర్​లు (Science fairs) విరివిరిగా నిర్వహించాలని, ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు పాల్గొనేలా ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కాగా గతేడాది పదో తరగతిలో మంచి ఫలితాలు వచ్చాయని, ఈసారి కూడా అదే స్పూర్తితో మరింత మెరుగైన ఉత్తీర్ణత నమోదయ్యేలా కృషి చేయాలని అన్నారు. ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారి పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు.

కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథం, సృజనాత్మకత పెంపొందించడం ఎంతో అవసరమని అన్నారు. అయితే ప్రైవేట్ పాఠశాలల (private schools) నుంచి సైన్స్ ఫేర్, ఇన్ స్పైర్ కార్యక్రమాలలో విద్యార్థుల భాగస్వామ్యం గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. వైజ్ఞానిక ప్రదర్శనల నిర్వహణతో పాటు, ఈ ప్రదర్శనలలో పాల్గొనే విద్యార్థులకు కూడా జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాస్థాయి ఇన్​స్పైర్​కు ఎంపికైన 119 మంది విద్యార్థులకు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహక రూపంలో రూ. 10వేలు చొప్పున నిధులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో (government schools) విద్యా ప్రమాణాలు మెరుగుపర్చడంతో పాటు, ఇంటర్నెట్ వంటి అన్ని సదుపాయాలు అందుబాటులోకి తెచ్చామని అన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీల్లో (School Games Federation sports competitions) ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు. భగవద్గీత గ్రంథాన్ని మూడు నెలల వ్యవధిలో ఉర్దూలో అనువదించిన బోధన్ పట్టణానికి చెందిన ముస్లిం యువతి ఫాతిమాను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, డీసీసీబీ ఛైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీఈవో అశోక్, సైన్స్ ఫేర్ అధికారి గంగా కిషన్ పాల్గొన్నారు.