HomeతెలంగాణPolice constable | ఖాకీ ముసుగులో ఇసుక దందా.. కోట్లకు పడగలెత్తిన కానిస్టేబుల్​..

Police constable | ఖాకీ ముసుగులో ఇసుక దందా.. కోట్లకు పడగలెత్తిన కానిస్టేబుల్​..

అతగాడు ఓ సాదాసీదా కానిస్టేబుల్.. ఖాకీ ముసుగులో ఇసుక అక్రమ దందా నడిపి ఏకంగా రూ. కోట్లకు పడగలెత్తాడు. పోలీస్​ శాఖను అడ్డంగా పెట్టుకుని అక్రమంగా కోట్లు కొల్లగొట్టాడు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Police constable | అతగాడు ఓ సాదాసీదా కానిస్టేబుల్.. మహా అయితే నెలకు రూ. లక్ష జీతం. కానీ ఆస్తుల చిట్టా మాత్రం రూ. కోట్లలోనే ఉంటుంది. అదెలా అనుకుంటున్నారా.. ఖాకీ ముసుగులో అతగాడు చేస్తున్న అక్రమ దందాలే ఇందుకు కారణం. తన పోలీసు బలగాన్ని అడ్డం పెట్టుకుని ఇసుక అక్రమ దందాను నడిపించడంతో పాటు ఏకంగా ఇసుకను శుద్ధి చేసే ప్లాంటునే నిర్మించేశాడు. అత్యంత క్రమశిక్షణ, బాధ్యతయుతమైన పోలీస్​ శాఖలో పనిచేస్తూ ఇలా అక్రమ దందా నడిపిస్తున్న కానిస్టేబుల్​ లీలలు అన్నీ ఇన్ని కావు.

బాసర రైల్వే స్టేషన్​లో జీఆర్​పీ కానిస్టేబుల్​గా పనిచేస్తున్న ఇతగాడు గతంలో నిజామాబాద్​ జిల్లాలోని వివిధ స్టేషన్లలో పనిచేశాడు. మాక్లూర్​ మండలానికి చెందిన సదరు కానిస్టేబుల్​ నిజామాబాద్​ ఉమెన్​ పీఎస్​, రూరల్​ పోలీస్​ స్టేషన్లలో పనిచేస్తున్న సమయంలో అప్పటి అధికారులను మచ్చిక చేసుకుని దొడ్డిదారిలో ఇసుక దందాను నడిపించాడు. జన్నెపల్లి వాగు, బోధన్​, మాక్లూర్​ పరిధిలోని పలు ఇసుక నిల్వలను కొల్లగొట్టాడు. చీకటి పడగానే పెద్దమొత్తంలో ఇసుకను తరలించి మాక్లూర్​లోని మాదాపూర్​లో డంపు చేసేవాడు. ఇతగాడికి స్వయానా చిన్నాన్న అయిన మరో వ్యక్తిని తెర ముందుంచి ఈ మొత్తం ఇసుక దందాను మూడు పూలు, ఆరు కాయలు అన్న చందంగా నడిపించాడు.

కాగా.. ఈ ఇసుక దందా బాగోతంపై గతంలో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. పలువురు ఆధారాలతో సహా అప్పటి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముందే అప్రమత్తమైన ఈ ఖాకీ ఇసుక అక్రమార్కుడు లాండ్​ ఆర్డర్​ పోస్టింగ్​ నుంచి మూటాముల్లె సర్దుకుని రైల్వేశాఖలో లూప్​లైన్​కు వెళ్లిపోయాడు. అయినప్పటికీ అతగాడి దందాను మాత్రం ఆపలేదు. తనకున్న పరిచయాలతో రాత్రి వేళల్లో విధుల్లో ఉండే సిబ్బందిని మచ్చిక చేసుకుని ఇసుక దందాను దర్జాగా కొనసాగించాడు. కట్​ చేస్తే.. ప్రస్తుతం కరోడ్​పతి జాబితాలోకి ఎక్కడం గమనార్హం.

Police constable | సొంత ఊరిలో రైస్​మిల్లు, ఇసుక ప్లాంట్​

ఇంతటితో సరిపెట్టుకోకుండా సదరు కానిస్టేబుల్​ మాక్లూర్​ మండలంలోని తన సొంతూరిలో ఏకంగా ఓ ఇసుక ప్లాంట్​ను నిర్మించాడు. గ్రామానికి సమీపంలోని వాగు నుంచి వేలాది టిప్పర్ల ఇసుకను తరలించి అక్కడ డంప్​ చేసుకున్నాడు. దీనికి తోడు దాదాపు రూ. 6 కోట్ల ఓ రైస్​మిల్లును సైతం నిర్మించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అతగాడి ఆస్తుల చిట్టాకు లెక్కే లేకుండా పోతుంది. మరోవైపు సొంతంగా పది ఇసుక టిప్పర్లను నిర్వహించడం గమనార్హం. ఇంత జరుగుతున్నా పోలీసులు తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరించడం కొసమెరుపు. ప్రత్యేకించి మాక్లూర్​ పోలీస్​ స్టేషన్​ ఎస్​హెచ్​వోగా పనిచేసిన ప్రతి అధికారి ఇతగాడి నుంచి ఆమ్యామ్యాలు తీసుకుని అండదండలు అందిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ వ్యక్తులు చిన్నపాటి ఇసుక టిప్పర్​ తీసుకెళ్తే కేసులు నమోదు చేసి రిపోర్టు పంపే పోలీసులు, ఇంటలిజెన్స్​ అధికారులు సొంత శాఖకు చెందిన పోలీస్​ సిబ్బందిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది..

కానిస్టేబుల్​ ఆస్తి చిట్టాపై వివరాలు అతి త్వరలో..