Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad | డీసీఈబీ కార్యదర్శి నియామకంలో నిబంధనలకు పాతర.. డీఈవో నిర్ణయంపై విమర్శలు

Nizamabad | డీసీఈబీ కార్యదర్శి నియామకంలో నిబంధనలకు పాతర.. డీఈవో నిర్ణయంపై విమర్శలు

డీసీఈబీ కార్యదర్శిగా మరోసారి సీతయ్యను నియమిస్తూ డీఈవో అశోక్​ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ నియామకంలో నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nizamabad | విద్యాశాఖలో డీసీఈబీ (డిస్ట్రిక్ట్​ కామన్​ ఎగ్జామినేషన్​ బోర్డు) కార్యదర్శి పాత్ర అత్యంత కీలకం. ఎలాంటి ఆరోపణలు లేనివారు ఈ పోస్టుకు అర్హులు.

ప్రత్యేకించి సంఘాలతో సంబంధం లేని వారిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ నిజామాబాద్​ (Nizamabad) డీసీఈబీగా మరోసారి సీతయ్యను కొనసాగిస్తూ డీఈవో అశోక్​ ఉత్తర్వులు జారీ చేయడం విద్యాశాఖలో చర్చకు దారి తీసింది.

నిజామాబాద్​ రూరల్​ నియోజకవర్గంలోని డిచ్​పల్లి మండలంలో (Dichpalli Mandal) పీజీ హెచ్​ఎంగా పని చేస్తున్న సీతయ్య గత రెండు పర్యాయాలుగా డీసీఈబీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. కాగా.. ఆయనను మరో దఫా కొనసాగించాలని డీఈవో నిర్ణయించారు. వాస్తవానికి డీసీఈబీ సర్వసభ్య సమావేశంలో డీఈవోతో పాటు పలువురు సభ్యులు ఉంటారు. వీరందరి నిర్ణయం మేరకే సభ్యుల్లో ఒక్కరిని సెక్రెటరీగా ఎంపిక చేయాలి. కానీ శుక్రవారం జరిగిన సమావేశంలో డీఈవో అశోక్​ (DEO Ashok) ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తానే స్వయంగా పేరును ప్రకటించడం, సభ్యులను ఒప్పించడం, చివరకు హడావుడిగా అధికారికంగా ఉత్తర్వులను సైతం జారీ చేయడం గమనార్హం. దీని వెనుక రకరకాల ప్రచారాలు తెరపైకి వస్తున్నాయి. మరోవైపు లెక్క పద్దులపై ఎలాంటి చర్చ జరగకుండా కేవలం 20 నిమిషాల్లో సమావేశం ముగించడం ఏమిటని పలువురు చర్చించుకుంటున్నారు.

Nizamabad | ఆరోపణలెన్నో..

డీసీఈబీ సెక్రెటరీగా ఎన్నికైన సీతయ్యపై ఆది నుంచి పలు ఆరోపణలు ఉన్నాయి. సంఘాల్లో క్రీయాశీలకంగా వ్యవహరించడంతో పాటు బీఆర్​ఎస్​ నేతలతో (BRS Leader) చట్టపట్టాలేసుకుని తిరిగేవారని ప్రచారంలో ఉంది. ముఖ్యంగా ఈయన హయాంలో పలుమార్లు ప్రశ్నాపత్రాలు లీకేజీ కాగా.. ఇందుకు బాధ్యుడిగా ఓ క్లర్క్​పై చర్యలు తీసుకొని మమ అనిపించారు. కాగా.. ఇవేమీ లెక్క చేయకుండా.. సీతయ్యను మరోసారి సెక్రెటరీగా నియమిస్తూ డీఈవో ఉత్తర్వులు ఇవ్వడం విద్యాశాఖలో సరికొత్త వివాదాలకు తెరలేపింది.

Nizamabad | నిబంధనలు పక్కన పెట్టి..

డీసీఈబీ సెక్రెటరీగా నియమితులు అయ్యేవారు పీజీ హెచ్​ఎంల సీనియారిటీ జాబితాలో మొదటి వరుసలో ఉండాలి. దీనికి తోడు కార్యాలయానికి సమీపంలో లేదా.. 8 కిలోమీటర్ల పరిధిలో పని చేస్తుండాలి. ప్రభుత్వ మేనేజ్​మెంట్​ స్కూల్​ హెచ్​ఎంలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ తాజా నియామకంలో ఈ నిబంధనలను పక్కన పెట్టారు. తన హయాంలో అంతా నిబంధనల మేరకు జరుగుతుందని, ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం ఉండదని తనకు తాను ప్రకటించుకునే డీఈవో అశోక్​.. డీసీఈబీ కార్యదర్శి నియామకంలో ఈ నిబంధనలు లెక్క చేయకపోవడం కొసమెరుపు. పైపెచ్చు రెడ్డిల సంఘం మారు పేరుతో కలిగిన ఓ ఉపాధ్యాయ సంఘం నాయకుడు ఈ నియామకం వెనుక లాబీయింగ్​ జరిపారని విద్యాశాఖలో చర్చ జరుగుతోంది.