అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad City | నిజామాబాద్ జిల్లాలో కొన్నేళ్ల నుంచి నేరాలకు పాల్పడుతున్న రౌడీషీటర్ బర్సాత్ అమేర్‌కు పోలీసులు జిల్లా బహిష్కరణ విధించారు. సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) వెలువరించిన ఉత్తర్వులను పోలీసులు సోమవారం అతడికి అందజేశారు.
Nizamabad City | ఆరేళ్లుగా నేరాలకు పాల్పడుతూ..
నగరంలోని ఆటో నగర్‌కు చెందిన బర్సాత్ అమేర్ జిల్లాలో వివిధ నేరాలకు పాల్పడ్డాడు. ఇప్పటికే అతడిపై 22 కేసులు నమోదై ఉన్నాయి. అతను గత ఆరేళ్లుగా నేరాలకు పాల్పడుతూ జిల్లా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని పోలీసు రికార్డుల్లో ఉంది. అంతేకాకుండా ఒకసారి పీడీ యాక్ట్‌ను (PD ACT) కూడా ప్రయోగించారు.
Nizamabad City | జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ మారని ప్రవర్తన..
బర్సాత్ అమేర్ అనేకమార్లు జైలుకు వెళ్లినప్పటికీ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రావడం లేదని సీపీ పేర్కొన్నారు. ఇతని వల్ల జిల్లాలో శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందన్నారు. ఇందుకుగాను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ తనకున్న అధికారాల మేరకు సెక్షన్ 26(1)(a) హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్-1348’ ప్రయోగించారు. ఈ చట్టం ప్రకారం రానున్న ఎలక్షన్ దృష్ట్యా బర్సాత్ అమేర్‌ను ఏడాది పాటు నిజామాబాద్ జిల్లా నుంచి బహిష్కరణ చేశారు.