అక్షరటుడే, ఇందల్వాయి: Nanyang Technological University | కూలీ పనులు చేసుకుంటూ తమ కుమారుడిని అత్యుత్తమ స్థాయిలో నిలపాలన్న ఆ నిరుపేద తల్లిదండ్రుల కలను ఈ యువకుడు నిజం చేశాడు.
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలోని ఎత్తు తండాకు చెందిన వారు దేగావత్ వినోద్. సాధారణ రైతు కూలీ కుటుంబంలో జన్మించిన వినోద్ ఇందల్వాయిలోని జ్ఞాన వాగ్దేవి విద్యాలయంలో చదివారు.
10వ తరగతిలో 8.5 జీపీఏ సాధించారు. ఇంటర్మీడియట్ చదవడానికి డబ్బు లేకపోవడంతో నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమాలో చేరి, 79 శాతం మార్కులు సాధించాడు.
ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (Engineering Common Entrance Test – ECET)లో (సివిల్ ఇంజినీరింగ్ – Civil Engineering) 310వ ర్యాంకు సాధించి, హైదరాబాద్‌లోని గురు నానక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Guru Nanak Institute of Technology, Hyderabad) లో ఉచిత సీటు పొందారు.
బీటెక్ చదువుతూనే ఒక కోచింగ్ సెంటర్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసి 5 వేల సివిల్ ఇంజినీరింగ్ MCQలు తయారు చేశారు. ఆ అనుభవం అతన్ని ఆర్థికంగా స్థిరపరిచింది.
Nanyang Technological University | మొదటి ప్రయత్నంలోనే గేట్
అనంతరం మొదటి ప్రయత్నంలోనే GATE ప్రతిభ చూపి, కేరళ (Kerala) లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – కాలికట్ (National Institute of Technology – Calicut) లో వాటర్ రిసోర్సెస్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. అక్కడే రెండు పరిశోధనా వ్యాసాలు ప్రముఖ జర్నల్స్‌లో ప్రచురించారు.
ఆ తర్వాత కర్ణాటకలోని సురత్‌కల్ (Suratkal, Karnataka) లో ఉన్న NIT నుంచి Ph.D. పట్టా అందుకున్నారు. హైడ్రోక్లైమాటాలజీ రంగంలో 13 పరిశోధనా వ్యాసాలు ప్రచురించారు. కేవలం 3 సంవత్సరాల 2 నెలల్లో డాక్టరేట్ పూర్తి చేశారు. ముంబయి IITలో పోస్ట్‌డాక్టరల్ రీసెర్చర్‌గా చేరారు.
ముంబయి ఐఐటీ ప్రొఫెసర్‌ను తన పరిశోధనా దృక్పథంతో ఆకట్టుకున్న వినోద్.. సింగపూర్‌లోని నాన్‌యాంగ్ టెక్నలాజికల్ యూనివర్శిటీ నుంచి రీసెర్చ్ మేనేజర్ పదవి ఆహ్వానం అందుకున్నారు.
సంవత్సరానికి $78,000 సింగపూర్ డాలర్ల (ఇండియన్ కరెన్సీ రూ.55 లక్షలు) ప్యాకేజీతో చేరేందుకు ఆహ్వానం అందింది. ఈ మేరకు బెంగళూరులోని యూనివర్సిటీలో వినోద్‌ను ఘనంగా సన్మానించారు.
రోజువారి కూలీ పనులు చేసుకునే కుటుంబం నుంచి వచ్చిన వినోద్.. తన అకుంఠిత దీక్షతో ఉన్నత స్థాయికి తీరు.. నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం.
