అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kadapa | సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి కొంత మంది యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదకరంగా స్టంట్లు చేస్తున్నారు. రీల్స్ (Reels) మోజులో పడి కన్న వారికి కడుపు కోత మిగులుస్తున్నారు.
సోషల్ మీడియా (Social Media) యుగంలో చాలా మంది రీల్స్ చూస్తూ కాలం గడిపేస్తున్నారు. గంటల కొద్ది స్మార్ట్‌ఫోన్ చూస్తున్నారు. పలువురు రీల్స్ చేస్తూ ఫేమస్ అవుతున్నారు. డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే తాము కూడా ఫేమస్ కావాలని కొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. బైక్‌లపై విన్యాసాలు చేయడంతో పాటు రైల్వే ట్రాక్‌లపై రీల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు గాయపడుతుండగా.. మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇద్దరు యువకులు రీల్స్ కోసం వెళ్లి చనిపోయారు.
Kadapa | ప్రవాహం పెరగడంతో..
కడప (Kadapa) నగరానికి చెందిన ఐదుగురు యువకులు ఆదివారం రీల్స్ చేయడానికి నగర శివారులోని వాటర్ గండి ప్రాంతానికి వెళ్లారు. నీటిలో దిగి రీల్స్ చేయడం ప్రారంభించారు. అయితే ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో ముగ్గురు యువకులు నీటిలో కొట్టుకుపోయారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి వారిలో ఒకరిని కాపాడారు. మిగతా ఇద్దరు గల్లంతయ్యారు. వెంటనే మిగతా వారు పోలీసు (Kadapa Police)లకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం రాత్రి వరకు వెతికినా వారి ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం మళ్లీ గాలించగా.. ఇద్దరు యువకుల మృతదేహాలు లభించాయి. మృతులను అశోక్ నగర్ (Ashok Nagar)కు చెందిన గెంటెన్ రోహిత్, కామినేని నరేష్‌గా గుర్తించారు.
