అక్షరటుడే, వెబ్‌డెస్క్: WPL 2026 | మహిళా ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే ఊహించని ఫలితం నమోదైంది. హైటెన్షన్ వాతావరణంలో సాగిన ఈ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians)ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మట్టికరిపించింది. ముంబై నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ చేధించి, కొత్త సీజన్‌ను ఘన విజయంతో ప్రారంభించింది.
ఒక దశలో ముంబై బౌలర్ల పట్టు ముందు ఆర్సీబీ ఓటమి ఖాయం అనిపించినా, దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ నాడిన్ డి క్లెర్క్ అసాధారణ ప్రదర్శనతో మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేసింది.155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు స్మృతి మందన, గ్రేస్ హారిస్ మంచి ఆరంభం అందించారు. ఆరంభ ఓవర్లలో ధైర్యంగా బ్యాటింగ్ చేసిన ఈ జోడీ ముంబై బౌలర్లపై ఒత్తిడి తీసుకొచ్చింది.
WPL 2026 | ఆసక్తికర పోరు..
అయితే మధ్య ఓవర్లలో ముంబై బౌలర్లు పుంజుకుని వరుసగా వికెట్లు తీయడంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది. హేమలత, రిచా ఘోష్, రాధా యాదవ్ (Radha yadav) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో ఒక దశలో 121 పరుగులకే ఏడుగురు బ్యాటర్లు ఔట్ అయ్యారు. చివరి 12 బంతుల్లో 29 పరుగులు అవసరమైన కీలక సమయంలో డి క్లెర్క్ బాధ్యతను తన భుజాలపై వేసుకుంది. అనుభవజ్ఞురాలైన నటాలీ స్కివర్ బ్రంట్ వేసిన 19వ ఓవర్‌లో డి క్లెర్క్ చెలరేగిపోయింది. వరుసగా భారీ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడి ఆ ఓవర్‌లోనే 20 పరుగులు రాబట్టి మ్యాచ్‌ను ఆర్సీబీ (Royal Challengers Bangalore) వైపు తిప్పింది. దీంతో చివరి ఓవర్‌కు ముందే బెంగళూరు జట్టు లక్ష్యాన్ని దాటేసి 157 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఒత్తిడిలోనూ నిలకడగా ఆడిన డి క్లెర్క్ 44 బంతుల్లో అజేయ 63 పరుగులు చేసి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ప్రేమ్ రావత్ కూడా చివర్లో ఆమెకు చక్కని సహకారం అందించింది.
బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ డి క్లెర్క్ (De Klerk) మెరిసింది. ముంబై ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి పరుగుల ప్రవాహాన్ని అడ్డుకుంది. ముఖ్యంగా మధ్య ఓవర్లలో సజీవన్ సజనా, నికోలా కేరీ వికెట్లు తీసి ముంబైని పరిమిత స్కోరుకే కట్టడి చేయడంలో ఆమె పాత్ర కీలకంగా నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 154 పరుగులు చేసినప్పటికీ, చివరి ఓవర్లలో పరుగుల వరద కట్టడి చేయలేకపోవడం, ఫీల్డింగ్‌లో జరిగిన పొరపాట్లు ఆ జట్టు ఓటమికి కారణమయ్యాయి.డిఫెండింగ్ ఛాంపియన్ హోదాతో బరిలోకి దిగిన ముంబైకి ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారగా, ఆర్సీబీ మాత్రం పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈ విజయం “ఈ సాల కప్పు నమ్దే” అనే నినాదాన్ని మరోసారి అభిమానుల్లో ఉత్సాహంగా నింపింది. మ్యాచ్‌కు ముందు జరిగిన రంగురంగుల ప్రారంభ వేడుకలు కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి. హనీ సింగ్ పాటలు, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ డాన్స్‌లు స్టేడియాన్ని ఉత్సవ వాతావరణంతో నింపగా, హర్నాజ్ సంధూ చేసిన ప్రసంగం మహిళా శక్తిని చాటిచెప్పింది.