అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Actress Raashi Khanna | టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రాశి ఖన్నా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ ప్రయాణం, ఎదుర్కొన్న సవాళ్లు, కెరీర్ మలుపులు వంటి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
హిందీ సినిమా మద్రాస్ కెఫేతో చిత్రపరిశ్రమ (Film Industry)కు పరిచయమైన రాశి, ఆ తర్వాత దక్షిణ భారత సినీ రంగంలో తొలి అడుగులు వేసి ఇక్కడ మంచి అభిమాన గణాన్ని సంపాదించుకున్న విషయం తెలిసిందే. రాశి ఖన్నా (Actress Raashi Khanna) మాట్లాడుతూ మద్రాస్ కెఫే తనను నటిగా ప్రేక్షకులకు పరిచయం చేసిన ముఖ్యమైన చిత్రం అని గుర్తుచేసుకుంది. అయితే ఆ సినిమా తర్వాత కొంతకాలం వరకూ తనకు వచ్చిన పాత్రలన్నీ కమర్షియల్ షేడ్స్‌తోనే ఉండేవని, నటనకు అవకాశమిచ్చే రోల్స్ చాలా అరుదుగా వచ్చినట్టు తెలిపింది. నటిగా తన సామర్ధ్యాన్ని చూపే అవకాశం లేకపోవడం కొన్నిసార్లు నిరాశ కలిగించేదని ఆమె చెప్పింది.
Actress Raashi Khanna | అక్కడ నుండే టర్న్ ..
అయితే తన కెరీర్‌లో నిజమైన టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది తొలిప్రేమ సినిమా అని రాశి పేర్కొంది. వరుణ్ తేజ్‌తో కలిసి నటించిన ఈ చిత్రంలో తన పాత్ర ద్వారా ప్రజలు తనను కమర్షియల్ ఫేస్‌గా కాకుండా మంచి నటిగా స్వీకరించారని తెలిపింది. “తొలిప్రేమ నాకు కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. నటిగా మరింత ముందుకు వెళ్లేందుకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చింది. నా పై ఉన్న అభిప్రాయాలను పూర్తిగా మార్చేసిన సినిమా అది” అని రాశి అన్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం (Director Venky Atluri)లో వచ్చిన ఈ చిత్రం 2018లో విడుదలై మంచి విజయాన్ని సాధించి వరుణ్‌కు, రాశికి శుభఫలితాలను అందించింది. కెరీర్ విషయానికి వస్తే, రాశి ఇటీవల సిద్ధు జొన్నలగడ్డతో కలిసి తెలుసు కదా సినిమాతో ప్రేక్షకులని పలకరించింది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే సంవత్సరం మేలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇక కామెడీ చేయడం తనకు చాలా ఇష్టమని, అలాంటి పాత్రలు చేస్తే తనలోని ఎనర్జీ మరింత పెరుగుతుందని చెప్పింది. టచ్ చేసి చూడు సినిమాలో రవితేజతో కలిసి చేసిన కామెడీ సీన్స్ ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తుంచుకునేలా ఉంటాయని పేర్కొంది. “నేను ఇష్టపడే పాత్ర కోసం నా హృదయాన్ని పెట్టి పని చేస్తాను. కామెడీ చేయడం నా పర్సనాలిటీకి కూడా దగ్గరగా ఉంటుంది” అని రాశి తెలిపారు.
