అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Actress Pratyusha | తెలుగు సినీ పరిశ్రమనే కాక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హీరోయిన్ ప్రత్యూష ఆత్మహత్య కేసు మరోసారి న్యాయపరిధిలో ప్రధాన చర్చకు వచ్చింది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఈ ఘటనపై సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారం కీలక విచారణ నిర్వహించి తీర్పును రిజర్వ్ చేసింది.
ఈ కేసులో హైకోర్టు (High Court) విధించిన రెండు సంవత్సరాల జైలు శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి దాఖలు చేసిన క్రిమినల్ అప్పీల్‌తో పాటు, కూతురు మరణానికి కారణమైన నిందితుడికి శిక్షను పెంచాలంటూ ప్రత్యూష తల్లి సరోజినీదేవి వేసిన పిటిషన్‌పై జస్టిస్ రాజేశ్ బిందల్, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
Actress Pratyusha | ప్రత్యూష–సిద్ధార్థ ప్రేమకథతో మొదలైన విషాదం
సినిమాల్లోకి రాకముందే ప్రత్యూషకు ఆమెతో ఇంటర్ చదివిన సిద్ధార్థ రెడ్డితో ప్రేమ ఏర్పడింది. ఇంటర్ పూర్తయ్యాక ప్రత్యూష సినిమాల్లోకి అడుగుపెట్టగా, సిద్ధార్థ ఇంజినీరింగ్ చదువు ప్రారంభించాడు. కానీ 2002 ఫిబ్రవరి 23 సాయంత్రం మాత్రం వారి ఇద్దరి జీవితం గాడి తప్పింది. ఆ రోజు ఇద్దరూ విషం తాగిన పరిస్థితిలో ఆసుపత్రికి వచ్చారు. 24న ప్రత్యూష మృతిచెందగా, చికిత్స పొందిన సిద్ధార్థ మార్చి 9న డిశ్చార్జ్ అయ్యాడు. కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని తాగడం వల్లే ఇద్దరూ ప్రమాదానికి గురైనట్లు పరీక్షల్లో తెలిసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం (State Government) నియమించిన వైద్యబృందం నివేదిక ప్రకారం అందులో ప్రత్యూష మరణం ఆర్గానోఫాస్పేట్ విషప్రయోగం వల్లే అని తేలింది.
మరణానికి ముందు లైంగిక దాడి లక్షణాలు లేవు, ఊపిరాడక మరణించలేదు అని వైద్య బృందం చెప్పారు. అయితే ఈ కేసులో దర్యాప్తు జరిపిన సీబీఐ (CBI).. నిందితుడిపై సెక్షన్ 306 (ఆత్మహత్య ప్రేరేపించడం), 309 (ఆత్మహత్యకు యత్నించడం) కింద ఛార్జిషీట్ దాఖలు చేయడం జరిగింది. మరోవైపు ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ్ రెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు..రూ.5 వేల జరిమాన విధిస్తూ 2004 ఫిబ్రవరి 23న తీర్పు ఇచ్చింది. తర్వాత హైకోర్టు విచారణలో జైలుశిక్షను 2 సంవత్సరాలకు తగ్గించి, జరిమానాను రూ.50,000కు పెంచింది (2011 డిసెంబర్ 28). దీనిపై సిద్ధార్థరెడ్డి, సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు.ఇద్దరూ కలిసి పురుగుమందు తీసుకున్నందు వల్ల ఆత్మహత్యకు ఉసిగొల్పాడన్న అనేది నిజం కాదని సిద్ధార్థ్ రెడ్డి తరపు న్యాయవాది నాగముత్తు, ఎల్, నరసింహారెడ్డి వాదించారు. సుప్రీంకోర్టు అన్ని వాదనలు విని, కేసుపై తీర్పు రిజర్వ్ చేసింది. రెండు దశాబ్దాలుగా సాగుతున్న ఈ కేసుకు త్వరలోనే తుది నిర్ణయం వెలువడనుంది.
