Homeతాజావార్తలుHyderabad | సీన్ రివ‌ర్స్.. విడాకులు తీసుకున్న దంపతులు.. రెండోసారి పెళ్లి కోసం చిన్నారి కిడ్నాప్

Hyderabad | సీన్ రివ‌ర్స్.. విడాకులు తీసుకున్న దంపతులు.. రెండోసారి పెళ్లి కోసం చిన్నారి కిడ్నాప్

విడాకులు తీసుకున్న ఓ జంట మళ్లీ పెళ్లి చేసుకోవడానికి పెద్ద డ్రామా ప్లాన్ చేశారు. వారి వివాహానికి కుటుంబ పెద్దలు ఒప్పుకోకపోవడంతో, ఏ విధంగానైనా తమ నిర్ణయాన్ని అమలు చేసుకోవాలని ఇద్దరూ ప్రయత్నించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలో విడాకులు తీసుకున్న దంపతులు మళ్లీ పెళ్లి చేసుకోవడానికి వేసిన‌ ‘డ్రామా’ వెలుగులోకి వచ్చింది. తమ పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదనే కారణంతో, నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి, ఆమెను తమ కుమార్తెగా చూపించేందుకు ప్రయత్నించిన జంటను శామీర్‌పేట్ పోలీసులు (Shamirpet Police) అరెస్ట్ చేశారు.

చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. హకీంపేట్‌కు (Hakimpet) చెందిన మహ్మద్ ఫయాజ్ (25), గోల్కొండకు చెందిన సల్మా బేగం అలియాస్ సమ్రీన్ (24) ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. కొద్దికాలానికే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. విడాకుల తర్వాత ఫయాజ్ మరో యువతిని వివాహం చేసుకొని హకీంపేట్‌లో నివసించడం ప్రారంభించాడు.

Hyderabad | మళ్లీ ప్రేమ.. రెండోసారి పెళ్లి ప్లాన్

విడాకుల తర్వాత కూడా ఫయాజ్–సల్మాకు మధ్య సంబంధం కొనసాగింది. రెండేళ్లుగా వారు తరచూ కలుస్తుండగా, మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. కానీ ఫయాజ్ కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పుడు ఫయాజ్, సల్మా బేగం కలిసి వాళ్లను ఒప్పించేందుకు షాకింగ్ ప్లాన్ రచించారు. ఫయాజ్ తన తల్లిదండ్రులకు.. విడాకుల సమయంలో సల్మా గర్భవతిగా ఉన్నదని, త‌న‌కి ఆడపిల్ల పుట్టిందని అబద్ధం చెప్పాడు. తమకు ‘కూతురు’ ఉందని నమ్మించి మళ్లీ పెళ్లికి ఒప్పించాలని ఒత్తిడి చేశాడు. ఈ కథ నిజమని నిరూపించేందుకు పాపను కిడ్నాప్ చేయాలని నిర్ణయించారు.

నవంబర్ 21 మధ్యాహ్నం గోల్కొండ సాలేనగర్‌లో (Golconda Salenagar) ఇంటి ముందు ఆడుకుంటున్న సఫియా బేగం అనే నాలుగేళ్ల చిన్నారిని సల్మా బేగం మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లింది. తండ్రి, తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరిసరాల్లోని సీసీ కెమెరా ఫుటేజ్ (CCTV Footage) పరిశీలించిన పోలీసులు.. ఫయాజ్ ఆటోలో చిన్నారిని తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఆదివారం ఉదయం పోలీసులు ఫయాజ్ ఇంటిపై దాడి చేసి చిన్నారిని క్షేమంగా రక్షించారు. ఫయాజ్, సల్మా బేగంను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి ఆటో, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చిన్నారిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. రెండోసారి పెళ్లి చేసుకునే క్ర‌మంలో కుటుంబాన్ని ఒప్పించేందుకు ఇలాంటి ఆలోచ‌న చేయ‌డం దారుణ‌మ‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.