HomeUncategorizedMirugu Special | చేపల కోసం ఎగబడ్డ జనం.. అంతగా స్పెషల్ ఏంటీ..?

Mirugu Special | చేపల కోసం ఎగబడ్డ జనం.. అంతగా స్పెషల్ ఏంటీ..?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mirugu Special | మిరుగు(Mirugu) రోజు ఏ చెరువు గట్టును చూసినా ప్రజలు చేపల (Fish) కొనుగోలు కోసం బారులు తీరి కనిపిస్తారు. ఏ వీధిలో నుంచి వెళ్లిన చేపల పులుసు వాసన గుమ్మంటుంది. దీనికి కారణం ఈ రోజు చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదనే నమ్మకం. మృగశిర అనగానే గుర్తొచ్చేది చేపలు. ఈ కార్తె మొదటి రోజు చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఆదివారం ప్రజలు చేపల కోసం ఎగబడ్డారు.

మృగశిర కార్తె ప్రారంభం తొలిరోజును మిరుగు, మిర్గం అని పిలుస్తారు. సాధారణంగా మృగశిర కార్తె ప్రారంభం నుంచి వానాకాలం మొదలు అవుతుంది. రుతుపవనాలు (Monsoons) కూడా ఈ సమయంలోనే తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయి. దీంతో అప్పటి వరకు మండే ఎండలకు అలవాటైన ప్రజలు.. ఒక్కసారిగా వాతావరణం మారడంతో అనారోగ్యాల బారిన పడుతారు.

Mirugu Special | ఆరోగ్యం కోసం..

ఒక్కసారిగా వాతావరణంలో మార్పులతో ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది. శరీరంలో రోగ నిరోధకశక్తి తగ్గి జ్వరం, దగ్గు, శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి. మృగశిర కార్తెలో చేపలు తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చని పెద్దలు చెబుతారు. వాతావరణం చల్లబడటంతో.. శరీరంలో వేడి కోసం చేపలు తినాలని చెబుతారు. దీంతో మిరుగు రోజు ప్రజలు చేపల కొనుగోలుకు ఆసక్తి చూపుతారు. మత్స్యకారులు కూడా మిరుగు సందర్భంగా చేపలు వేటాడి గ్రామాల్లో చెరువుల వద్ద విక్రయిస్తారు. దీంతో చెరువులు, పట్టణాల్లోని చేపల మార్కెట్​లో సందడి నెలకొంది.

Mirugu Special | ఇంగువ బెల్లం..

మిర్గం రోజు శాఖాహారులు ఇంగువను బెల్లంలో కలుపుకొని ఉండలుగా చేసుకుని తింటారు. అంతేగాకుండా ఏ ఇంట్లో చూసిన మామిడి పండ్ల రసం ప్రత్యేకంగా ఉంటుంది. మామిడి పండ్లు, చేపలు, బెల్లం, ఇంగువ శరీరంలో ఉష్ణోగ్రతను పెంచడానికి దోహదపడుతాయి. దీంతో వాతావరణ మార్పులకు అనుగుణంగా శరీరం అడ్జస్ట్​ కావడానికి ఇవి ఎంతో సాయం చేస్తాయనే నమ్మకం ఉంది. దీంతో మిరుగు రోజు వీటిని తింటారు.

Mirugu Special | రైతులకు ప్రత్యేకం

గతంలో రైతులు (Farmers) మృగశిర కార్తె తర్వాతే వ్యవసాయ పనులు మొదలు పెట్టేవారు. రోహిణి కార్తెలో విపరీమైన ఎండలు ఉంటాయి. మృగశిరలో తొలకరి వానలు పలకరిస్తాయి. దీంతో అన్నదాతలు దుక్కులు దున్నడం, తుకం పోయడం, విత్తనాలు నాటడం లాంటి పనులు గతంలో మృగశిర కార్తెలోనే చేపట్టేవారు. ప్రస్తుతం వర్షాలు ముందుగా పడటంతో రైతులు వ్యవసాయ పనులు కూడా ముందుగానే ప్రారంభించారు.