అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Local Body Elections | రాష్ట్రంలో పంచాయతీ ఎన్నిల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (Election Commission) సిద్ధం అవుతోంది. ఈ మేరకు గురువారం ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
బీఆర్ఎస్ హయాంలో పంచాయతీ రాజ్ చట్టం –2018 అమలులోకి తీసుకొచ్చారు. దీని ప్రకారం పంచాయతీలకు పదేళ్ల పాటు ఒకే రిజర్వేషన్ వర్తిస్తుంది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ చట్టానికి సవరణ చేసింది. దీంతో రిజర్వేషన్లు మారనున్నాయి. గత ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్లు ఉండే అవకాశం లేదు. మొత్తం 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. 27 శాతం సర్పంచ్ స్థానాలను బీసీలకు రిజర్వ్ చేయనున్నారు. ఎస్టీ, ఆ తర్వాత ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్ల జాబితాను ఎంపిక చేయనున్నారు.
Local Body Elections | 12,760 గ్రామాల్లో..
రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు ఉండగా.. 31 జిల్లాల్లో పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) జరగున్నాయి. హైదరాబాద్, మేడ్చల్ –మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో గ్రామాలు లేవు. దీంతో అక్కడ ఎన్నికలు ఉండవు. మిగతా 31 జిల్లాల్లోని 12,760 గ్రామాలు, 1,13,534 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 50 శాతం సీట్లను రిజర్వ్ చేస్తారు. మిగిలిన వాటిని జనరల్‌కు కేటాయిస్తారు. 2024 బీసీ కుల గణన ప్రకారం.. బీసీ రిజర్వేషన్లు (BC Reservations) ఖరారు చేస్తారు. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం.. సీట్లను రిజర్వ్ చేయనున్నారు. మొత్తం సీట్లలో 50 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేస్తారు.
కాగా సర్పంచుల రిజర్వేషన్లను ఆర్డీవోలు, వార్డుల రిజర్వేషన్లను ఎంపీడీవోలు ఖరారు చేయనున్నారు. జనాభా ప్రతిపాదికన రోస్టర్ ఆధారంగా రిజర్వేషన్లు కేటాయిస్తారు. ఈ నెల 24 హైకోర్టులో స్థానిక ఎన్నికల (Local Body Elections)పై విచారణ ఉంది. ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. డిసెంబర్లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. పోలింగ్ రోజే ఫలితాలు ప్రకటిస్తారు.
