Homeతాజావార్తలుSarpanch Elections | నేడే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్​

Sarpanch Elections | నేడే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్​

పంచాయతీ ఎన్నికలకు కొద్ది గంటల్లో నగారా మోగనుంది. మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sarpanch Elections | నెలలుగా నెలకొన్న ఉత్కంఠకు తెర పడనుంది. పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్​ విడుదల కానుంది. జీపీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల సంఘం (Election Commission) సైతం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

ఇప్పటికే ఓటర్ల తుది జాబితాతో పాటు పోలింగ్​ కేంద్రాల వివరాలను ఈసీ ప్రదర్శించింది. మరోవైపు ప్రభుత్వం సర్పంచ్​, వార్డు స్థానాల రిజర్వేషన్లను ఖరారు చేసింది. దీంతో గ్రామాల్లో ప్రజలు, నాయకులు ఎన్నికల కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం మంగళవారం సాయంత్రం షెడ్యూల్​ విడుదల చేయడానికి సిద్ధం అయింది.

పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. నవంబర్ 25న సాయంత్రం 6:15 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. గ్రామ పంచాయతీలకు సాధారణ ఎన్నికల నిర్వహణపై వివరాలు వెల్లడించనున్నట్లు పేర్కొంది. డిసెంబర్​ రెండో వారంలో ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్​, నామినేషన్లు, పోలింగ్​ తేదీల వివరాలను ఎన్నికల సంఘం వెల్లడించే అవకాశం ఉంది. జిల్లాల వారీగా సర్పంచ్​, వార్డు సభ్యుల రిజర్వేషన్ల గెజిట్లు పంచాయతీరాజ్​శాఖ కమిషనరేట్​కు సోమవారం మధ్యాహ్నం చేరుకున్నాయి.

Sarpanch Elections | 12,760 గ్రామాల్లో..

రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు ఉండగా.. 31 జిల్లాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్, మేడ్చల్ –మల్కాజ్​గిరి జిల్లాల పరిధిలో గ్రామాలు లేవు. దీంతో అక్కడ ఎన్నికలు ఉండవు. మిగతా 31 జిల్లాల్లోని 12,760 గ్రామాలు, 1,13,534 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. వార్డు సభ్యుల రిజర్వేషన్లను బీసీ కుల గణన (BC Caste Census) ప్రకారం ఖరారు చేశారు. సర్పంచ్​ స్థానాలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లను కుల గణన ఆధారంగా, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కల ప్రకారం కేటాయించారు. మొత్తం సీట్లలో 50 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేశారు.

Sarpanch Elections | మూడు దశల్లో..

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహిస్తారని సమాచారం. డిసెంబర్ 11, 14, 17వ తేదీల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్​ఎస్​ హయాంలో తీసుకు వచ్చినట్లు బీసీలకు 27శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికల నోటిఫికేషన్​ విడుదల చేయనున్నారు. అయితే కాంగ్రెస్​ మాత్రం 42 శాతం టికెట్లను పార్టీ పరంగా బీసీలకు కేటాయిస్తామని ప్రకటించింది. దీంతో మిగతా పార్టీలు కూడా అదే బాట పట్టే అవకాశం ఉంది.