అక్షరటుడే, వెబ్డెస్క్: Panchayat elections | రాష్ట్రంలో త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. రెండు మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్నారు. అభివృద్ధికి అడ్డుపడే వారిని ఎన్నుకోవద్దని, అభివృద్ధి చేసే వారికే అండగా నిలవాలని సూచించారు. ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.
ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో (Kodangal) సోమవారం పర్యటించారు. మధ్యాహ్న భోజన పథకం (mid-day meal scheme) కోసం కేంద్రీకృత వంటగదితో సహా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రం నలుమూలల నుంచి చదువుకోసం కొడంగల్ వచ్చేలా విద్యా సంస్థలు (educational institutions) ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఉస్మానియాలో కూడా లేనన్ని విభాగాలు కొడంగల్ క్యాంపస్‌లో ఏర్పాటు చేస్తామన్నారు. కొడంగల్‌లో త్వరలోనే సిమెంట్ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Panchayat elections | విద్యార్థులకు అల్పాహారం
నాణ్యమైన విద్య ద్వారానే పేదల జీవితాలు మారుతాయని సీఎం అన్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని (Kodangal assembly constituency) 312 ప్రభుత్వ పాఠశాలల్లోని 28,000 మంది విద్యార్థులకు ప్రభుత్వం అల్పాహారం అందిస్తోందని తెలిపారు. తమ ప్రభుత్వం విద్య, నీటిపారుదల, మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళా సంఘాలకు సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో లగచర్ల పారిశ్రామిక పార్కు (Lagacherla Industrial Park) నిర్మిస్తామని తెలిపారు. కోడంగల్‌ను రోల్ మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యం రాబోయే 10 ఏళ్లు కొనసాగుతుందన్నారు.
Panchayat elections | పిట్టలను బెదిరించడానికి..
ప్రతి ఇంటికెళ్లి ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు (Indiramma sarees) ఇవ్వాలని అధికారులను ఆదేశించానని రేవంత్రెడ్డి చెప్పారు. గత పాలకులు మహిళలకు నాణ్యత లేని చీరలు ఇచ్చారని విమర్శించారు. పిట్టలను బెదిరించడానికి కేసీఆర్ చీరలను వాడేవారని ఎద్దేవా చేశారు. పండగ పూట ప్రభుత్వం ఇచ్చిన చీర కట్టుకోవాలని ఆయన కోరారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రైతులు స్వచ్ఛందంగా భూమిని ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసి నీటిపారుదల సౌకర్యాలను కల్పిస్తామన్నారు.
