అక్షరటుడే, ఇందూరు: Nizamabad District Education Officer | నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారికి నోటీసులు జారీ చేసినా కూడా విచారణకు హాజరుకాకపోవడంపై జిల్లా హ్యూమన్ రైట్స్ కోర్టు ( ఫస్ట్ క్లాస్ అడిషనల్ సెషన్స్) జడ్జి హరీషా ఆగ్రహం వ్యక్తం చేశారు.
డీఈవోకు బదులుగా విద్యాశాఖ కార్యాలయం సూపరింటెండెంట్ హాజరుకావడంపై జడ్జి అసహనం వ్యక్తం చేశారు. ధర్పల్లి మండలం మైలారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే పీఏగా పని చేస్తుండటంపై సామాజిక కార్యకర్త బొడ్డు గోపాల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించి విద్యాశాఖాధికారులు శ్రీనివాస్ రెడ్డి పీఏగా పని చేయడానికి సెలవులు మంజూరు చేయడంపై సహ చట్టం ద్వారా ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో సామాజిక కార్యకర్త కోర్టును ఆశ్రయించారు.
Nizamabad District Education Officer | నోటీసులు జారీ..
ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఈ నెల మొదటి వారంలో డీఈవో అశోక్‌తోపాటు ధర్పల్లి ఎంఈవోకు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. మంగళవారం సంబంధిత కేసు విచారణకు వచ్చింది.
జిల్లా హ్యూమన్ రైట్స్ కోర్టు న్యాయమూర్తి హరీషా ఎదుట పిటిషన్ తరఫున న్యాయవాది బాల్‌రాజ్ వాదనలు వినిపించారు. విద్యాశాఖాధికారులు ఏ విధంగా విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించి ప్రభుత్వ ఉపాధ్యాయుడిని వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసేందుకు సహాయ సహకారాలు అందించారో వివరించారు.
సంబంధిత కేసులో సహ చట్టం ద్వారా దరఖాస్తులు చేసినా విద్యాశాఖాధికారులు సమాచారం ఇవ్వకపోవడంపై న్యాయమూర్తి మండిపడ్డారు.
సంబంధిత ఆర్టీఐ సమాచారాన్ని తామే తెప్పిస్తామని చెప్పారు. సంబంధిత కేసులో డీఈవో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసును డిసెంబరు 30వ తేదీకి వాయిదా వేశారు.
