అక్షరటుడే, వెబ్డెస్క్ : Minister Nimmala | సాధారణంగా పెళ్లిళ్లలో వధూవరుల కుటుంబ సభ్యులు ఖరీదైన దుస్తులతో ఆకట్టుకుంటారు. కానీ ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) మాత్రం తన ప్రత్యేక శైలిని కొనసాగించారు.
బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు(Palakollu)లో జరిగిన తన కుమార్తె శ్రీజ–సాయి పవన్ కుమార్ వివాహంలో కూడా ఆయన తన ట్రేడ్‌మార్క్ పసుపు రంగు చొక్కాతోనే కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. పార్టీపై ఆయనకున్న విధేయతను మరోసారి చాటిన ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Minister Nimmala | పెళ్లిలోను పసుపు రంగు చొక్కానే..
ఈ వేడుకకు సీఎం చంద్రబాబు(CM Chandra Babu), ఆయన సతీమణి భువనేశ్వరి, నారా లోకేశ్(Nara Lokesh)తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రముఖ నేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో బంధుమిత్రులు పట్టువస్త్రాలతో మెరిసిపోతుండగా, మంత్రి రామానాయుడు మాత్రం పసుపు చొక్కాలో ప్రత్యేకంగా నిలిచారు. అయితే ఇది కొత్త విషయం కాదు. ఏ ప్రభుత్వ కార్యక్రమం అయినా, కుటుంబ వేడుకైనా ఆయన ఎప్పుడూ పసుపు చొక్కానే ధరిస్తారన్న విషయం తెలిసిందే. కుమార్తె నిశ్చితార్థంలోనూ ఇదే దుస్తులతో కనిపించగా, ఆ సందర్భంలో నారా లోకేశ్ సరదాగా ఆటపట్టించారు. “పెళ్లికొడుకులా రెడీ అవుతారని అనుకుంటే, పసుపు చొక్కాతోనే వచ్చారు” అని చెప్పగా, “పసుపు శుభసూచకం సార్” అంటూ రామానాయుడు ఇచ్చిన సమాధానం నవ్వులు పూయించింది.
పాలకొల్లు నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 2019లో వైసీపీ గాలి వీస్తున్నా టీడీపీ జెండా ఎగరేసిన నిమ్మల రామానాయుడు, పార్టీకి వీర విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన పనితీరును గుర్తించిన చంద్రబాబు, తాజా ప్రభుత్వంలో కీలకమైన జలవనరుల శాఖను అప్పగించారు. ఇప్పుడు కుమార్తె పెళ్లిలో కూడా పార్టీ రంగు చొక్కా(Party Color Shirt)ను వీడకపోవడం తెలుగు తమ్ముళ్లను మరింత ఆకట్టుకుంటోంది.