అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Patangi Toll Plaza | సంక్రాంతి సెలవులు (Pongal Holidays) ప్రారంభమవుతుండటంతో హైదరాబాద్ నుంచి జిల్లాల వైపు వెళ్లే వాహనాల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా నగరవాసులు పెద్ద ఎత్తున పల్లెబాట పట్టనుండటంతో జాతీయ రహదారులపై భారీ రద్దీ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై (Hyderabad-Vijayawada national highway) ట్రాఫిక్ ఒత్తిడి అధికంగా ఉండటం వల్ల టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితులు గతంలో ఎదురయ్యాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈసారి కొత్త సాంకేతికతను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది.
Patangi Toll Plaza | ఇక సమస్యే లేదు..
వాహనాలు టోల్ బూత్‌కు (Toll Boot) చేరగానే ఫాస్ట్‌ట్యాగ్ స్కానింగ్‌లో ఆలస్యం జరగకుండా, శాటిలైట్ ఆధారిత సెన్సార్ విధానాన్ని పంతంగి టోల్ ప్లాజా వద్ద అమలు చేశారు. సాధారణంగా ఫాస్ట్‌ట్యాగ్ రీడింగ్‌కు కొన్ని సెకన్లు పడుతుండగా, నెట్‌వర్క్ ఇబ్బందుల వల్ల వాహనాలు నిలిచిపోవడం సాధారణమే. కానీ శాటిలైట్ సిస్టమ్ ద్వారా వాహనం బూత్‌లోకి ప్రవేశించిన వెంటనే నంబర్ ప్లేట్‌ను గుర్తించి క్షణాల్లో టోల్ వసూలు పూర్తవుతుందని అధికారులు తెలిపారు. దీని వల్ల నిమిషానికి సుమారు 20 వాహనాలు నిరాఘాటంగా ముందుకు సాగగలవని అంచనా వేస్తున్నారు.
పంతంగి టోల్ ప్లాజా (Patangi Toll Plaza) మీదుగా సాధారణ రోజుల్లోనే దాదాపు 40 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. గత సంక్రాంతి సమయంలో ఈ సంఖ్య 80 వేలకుపైగా చేరడంతో భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ఈ ఏడాది అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలుగా విజయవాడ వైపు వెళ్లే ఎనిమిది టోల్ బూత్‌లకు శాటిలైట్ సెన్సార్ వ్యవస్థను అనుసంధానం చేశారు.
ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించి సాంకేతికంగా ఎలాంటి సమస్యలు లేవని నిర్ధారించారు. అదనంగా, రద్దీ మరింత పెరిగిన సందర్భాల్లో టోల్ సిబ్బంది హ్యాండ్ హెల్డ్ స్కానర్ల సహాయంతో వేగంగా వసూలు చేసే ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతానికి ఈ కొత్త విధానం పంతంగి టోల్ ప్లాజాకే పరిమితమై ఉన్నప్పటికీ, ప్రయోగం విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర కీలక టోల్ ప్లాజాల్లోనూ అమలు చేసే అవకాశముందని అధికారులు వెల్లడించారు. ఈ చర్యలతో సంక్రాంతి ప్రయాణాలు మరింత సాఫీగా సాగుతాయని వాహనదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.