అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వామపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ ఇలా త్రిపాఠికి (Collector Ila Tripathi) వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరుగుతున్న ధరల కనుగుణంగా కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.26వేలు అందించాలన్నారు.
Nizamabad City | జీతాలు అందక ఇబ్బందులు..
ఇటీవల మున్సిపల్ అధికారులు ఏడుగురు కార్మికులకు ఒక గ్రూపు చొప్పున ఏర్పాటు చేయాలని నిర్ణయించారని.. దీంతో జీతాలు అందక ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడుతుందన్నని సంఘం ప్రతినిధులు వాపోయారు. అలాకాకుండా ఇప్పటికే ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను కొనసాగిస్తూ.. మిగతా కార్మికులకు 50 నుంచి 100 మంది వరకు ఒక గ్రూపును ఏర్పాటు చేసి వారి అకౌంట్లో జీతాలను వేయాలని కోరారు.
గతంలో ప్రభుత్వం పెంచిన రూ.1000 వేతనాన్ని శానిటేషన్ డ్రైవర్లకు (sanitation drivers) ఇవ్వకుండా నిలిపేయడం సరికాదన్నారు. అలాగే వారాంతపు సెలవులు, పండగ సెలవులను కొనసాగించాలని కోరారు. ప్రధానంగా శానిటేషన్ విభాగంలో పనిచేసే కార్మికులకు రెండు జతల దుస్తులు, చెప్పులు, సబ్బులు, నూనె, పనిముట్లు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందించిన వారిలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్ బాబు, టీయూసీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ తదితరులున్నారు.