అక్షరటుడే, వెబ్డెస్క్ : Mulugu | రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) ముగిశాయి. బుధవారం మూడో విడత పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించారు. అయితే పోలింగ్ రోజు పని ఒత్తిడితో ఓ ఎంపీడీవో గుండెపోటుతో కుప్పకూలాడు.
ఎన్నికల విధుల్లో ఒత్తిడికి గురైన ఎంపీడీవో గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. హన్మకొండుకు చెందిన జి రాజేంద్రప్రసాద్ (60) ములుగు జిల్లా వెంకటాపురం ఎంపీడీవో (Venkatapuram MPDO)గా పని చేస్తున్నారు. అనారోగ్య కారణాలతో ఆయన కొంతకాలంగా సెలవులో ఉన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆయన తిరిగి విధుల్లో చేరారు. బుధవారం వెంకటాపురం మండలంలో మూడో విడత ఎన్నికలు జరిగాయి. ఎంపీడీవో ఎన్నికలను పర్యవేక్షించారు.
Mulugu | టీస్టాల్ దగ్గర..
కౌంటింగ్ అనంతరం సిబ్బందికి పారితోషికం చెల్లించారు. ఈ క్రమంలో తమకు తక్కువ డబ్బులు చెల్లించారని పలువురు ఆయనతో వాగ్వాదం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఒత్తిడికి గురైన ఆయన ఎంపీడీవో ఆఫీస్ సమీపంలోని టీ స్టాల్ వద్దకు వెళ్లాడు. అక్కడ కుప్పకూలిపోయారు. గమనించిన స్థానికులు, ఉద్యోగులు ఎంపీడీవోను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. గుండెపోటు (Heart attack) వచ్చినట్లు గుర్తించిన వైద్యులు ములుగు జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ వైద్యులు సీపీఆర్, ఇతర పరీక్షలు చేశారు. అనంతరం వరంగల్ (Warangal)కు తీసుకు వెళ్లాలని చెప్పారు. అక్కడకు తరలించగా.. చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు.