అక్షరటుడే, వెబ్డెస్క్ : Panchayat Elections | రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రం ఎన్నికల సంఘం (Election Commission) ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. మూడు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొంది.
పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని వెల్లడించారు. నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలోకి వచ్చినట్లు తెలిపారు. తొలి విడత ఎన్నికల ప్రక్రియ నవంబర్ 27న ప్రారంభం కానుంది. నవంబర్ 27 నుంచి తొలిదశ నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. డిసెంబర్ 11న ఎన్నిక ఉంటుంది. రెండో దశలో నవంబర్ 30 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 193 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. డిసెంబర్ 14న పోలింగ్ ఉంటుంది. మూడో దశ నామినేషన్లు డిసెంబర్ 3 నుంచి ప్రారంభం అవుతాయి. 182 మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 17న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషనర్ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడుతారు. అదే రోజు ఫలితాలు విడుదల చేయనున్నారు.
Panchayat Elections | 12,760 గ్రామాల్లో..
రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు ఉండగా.. 31 జిల్లాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్, మేడ్చల్ –మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో గ్రామాలు లేవు. దీంతో అక్కడ ఎన్నికలు ఉండవు. మిగతా 31 జిల్లాల్లోని 12,760 గ్రామాలు, 1,13,534 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. వార్డు సభ్యుల రిజర్వేషన్లను బీసీ కుల గణన ప్రకారం ఖరారు చేశారు. సర్పంచ్ స్థానాలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లను (BC Reservations) కుల గణన ఆధారంగా, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కల ప్రకారం కేటాయించారు. మొత్తం సీట్లలో 50 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేశారు.
